ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమలను ఆకర్షించి లక్ష మందికి పైగా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో రూ.31.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని లోకేష్ ప్రారంభించారు. ఈ సెంటర్‌లో కో-వర్కింగ్ స్పేస్, ఏపీఐఐసీ కార్యాలయం, బిజినెస్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, టెన్నిస్, బ్యాడ్మింటన్ కోర్టులు, పార్కింగ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించారు.
తరువాత ఆయన కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ నార్త్ బ్లాక్‌లో ప్రముఖ రెడీమేడ్ దుస్తుల తయారీ సంస్థ టెక్సానా మాన్యుఫ్యాక్చరింగ్ కొత్త యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టి ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ముంబై కేంద్రంగా ఉన్న టెక్స్ పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా ఇది పనిచేస్తూ, ఏటా 1.7 కోట్లకు పైగా దుస్తులను తయారు చేస్తోంది. పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తమ బాధ్యతగా తీసుకుంటానని లోకేష్ పేర్కొన్నారు.
అలాగే ప్రపంచ ప్రఖ్యాత టెక్నోడోమ్ కంపెనీ ఏర్పాటు చేసిన ఎల్ఈడీ టీవీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. రూ.121 కోట్ల పెట్టుబడితో ఏర్పడిన ఈ ప్లాంట్‌లో 300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఏటా 10 లక్షల టీవీలు, 10 లక్షల ఎల్ఈడీ మానిటర్లు తయారు చేయడంతో పాటు, భవిష్యత్తులో ఫ్రిజ్‌లు, ఏసీలు, ఇతర గృహోపకరణాలను కూడా తయారు చేయాలని కంపెనీ ప్రణాళికలు వేసింది. అదనంగా, స్మార్ట్ కిచెన్లు, ఆధునిక డిగ్రీ కళాశాల భవనాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా లోకేష్ ప్రారంభించారు.