ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేసి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా రేషన్ షాపుల్లో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇంటి దగ్గరే QR కోడ్ ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రక్రియలో రేషన్ షాపులు మ్యాపింగ్ అయిన సచివాలయ ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తారు. కార్డు ఇచ్చే సమయంలోనే లబ్ధిదారుల బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్, ఫేస్, ఐరిస్ లేదా ఆధార్ ఓటీపీ ద్వారా ధృవీకరణ చేసి మొబైల్ యాప్‌లో డేటా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రేషన్ డీలర్ల సహకారంతో ఉద్యోగులు ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు, ప్రజలు తమ రేషన్ కార్డు కోసం ఎవరిని సంప్రదించాలి అన్న వివరాలను ఒక ప్రత్యేక లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. జిల్లా, మండలం, సచివాలయం, రేషన్ షాప్ ఐడీ ఎంచుకుంటే సంబంధిత సచివాలయ ఉద్యోగి వివరాలు అందుబాటులోకి వస్తాయి.
రేషన్ పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద సడలింపు ఇచ్చింది. ఇప్పటివరకు నెలలో మొదటి 15 రోజుల్లోనే రేషన్ సరుకులు తీసుకోవాల్సిన అవసరం ఉండేది. అయితే ఇప్పుడు నెలంతా రేషన్ షాపులు తెరిచి ఉంటాయి. ఎప్పుడైనా రేషన్ తీసుకునే సౌకర్యం లభిస్తుంది. అదనంగా వచ్చే నెల నుంచి రేషన్‌లో గోధుమ పిండి కూడా ఇవ్వనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలకు మరింత వెసులుబాటు, పారదర్శకత కలుగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.