తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ చలాన్లు పేరుకుపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ TG09 RR0009 పై గణనీయంగా చలాన్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం బయటపడటంతో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. సీఎం కాన్వాయ్‌లో వినియోగిస్తున్న ఈ వాహనంపై ఇప్పటివరకు మొత్తం 18 ట్రాఫిక్ చలాన్లు నమోదు అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ చలాన్ల మొత్తం విలువ రూ.17,795గా ఉన్నట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎక్కువశాతం చలాన్లు మితిమీరిన వేగం కారణంగానే నమోదైనట్లు తేలింది. అంటే, సీఎం కాన్వాయ్‌లోని డ్రైవర్లు వేగ పరిమితిని అతిక్రమించడం వల్ల ఈ జరిమానాలు విధించబడ్డాయి.
ప్రస్తుతం ఈ చలాన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం కాన్వాయ్‌పై ఇంత పెద్ద ఎత్తున చలాన్లు ఉండటం కొందరిని ఆశ్చర్యపరుస్తుండగా, మరికొందరు దీన్ని ట్రాఫిక్ నియమాల అమలులో సమానత్వానికి నిదర్శనంగా చెబుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు పెద్దల వాహనాలు కూడా చట్టం ముందు ఒకటేనని ఈ ఘటన మరోసారి రుజువుచేస్తోందని కామెంట్లు వస్తున్నాయి.