తిరుమలకు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా నడుస్తున్న ప్రత్యేక రైళ్లు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు పొడిగించామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో తిరుపతి – సాయినగర్ షిర్డీ (07637/07638), నరసాపురం – తిరువణ్ణామలై (07219/07220) రైళ్లు నవంబర్ 24 వరకు నడుస్తాయని వెల్లడించారు. తిరుపతి – షిర్డీ రైలు ఏపీలో తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, గుంటూరు వంటి స్టేషన్లలో ఆగుతుండగా.. తెలంగాణలో మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.
ఇవే కాకుండా పలు ఇతర ప్రత్యేక రైళ్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. విశాఖపట్నం – ఎస్‌ఎంవీటీ బెంగళూరు (08581/08582), విశాఖపట్నం – తిరుపతి (08547/08548), విశాఖపట్నం – చర్లపల్లి (08579/08580) రైళ్లు వరుసగా అక్టోబర్ నుంచి నవంబర్ చివరి వరకు ప్రతి వారానికి ఒకసారి నడుస్తాయని తెలిపారు. నరసాపురం – తిరువణ్ణామలై మధ్య రైళ్లు అక్టోబర్, నవంబర్ నెలల్లో కొన్ని ప్రత్యేక తేదీల్లో అందుబాటులో ఉంటాయని కూడా రైల్వే అధికారులు వివరించారు.
అంతేకాదు చర్లపల్లి – బ్రహ్మపూర్ (07027/07028), చర్లపల్లి – షాలిమార్ (07225/07226), భువనేశ్వర్ – యశ్వంత్‌పూర్ (02811/02812) వంటి రైళ్లు కూడా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రత్యేక షెడ్యూల్ ప్రకారం నడుస్తాయి. దీంతో దసరా, దీపావళి పండుగల సమయంలో ప్రయాణికులకు రైలు సౌకర్యం పెరగనుంది.