ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగులకు, ముఖ్యంగా బధిరులకు(మూగమరియు చెవిటి) శుభవార్తను అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి ఉచితంగా టచ్ ఫోన్లు అందించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ప్రకటించింది. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన వారు, ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు, సైగల భాష తెలిసిన వారు, కనీసం 40 శాతం వైకల్యం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అదనంగా, కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు లోపుగా ఉండాలి. ఈ ప్రక్రియను స్పష్టంగా తెలిపిన రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వి. కామరాజు, దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి గలవారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలని సూచించారు.
దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని పత్రాలు అవసరం. వాటిలో ఆధార్ కార్డు, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మార్కుల జాబితాలు, సదరం ధ్రువీకరణ పత్రం, సైగల భాష ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు) తప్పనిసరిగా సమర్పించాలి. అదనంగా పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు కాపీలు కూడా జత చేయాలి.
దరఖాస్తుల కోసం ప్రత్యేకంగా [www.apdascac.ap.gov.in] (http://www.apdascac.ap.gov.in) వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. ఈ చర్య ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బధిరులకు డిజిటల్ కనెక్టివిటీని అందించడమే కాకుండా.. వారికి విద్య, ఉపాధి, సమాచార మార్పిడి అవకాశాలను పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వం ఇతర దివ్యాంగులకు కూడా సహాయక పరికరాలు అందజేయడానికి చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది పరికరాలను పంపిణీ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు కూడా పరీక్షలు నిర్వహించి, అర్హులైన వారికి పరికరాలు అందించనున్నారు.
సమగ్ర శిక్ష పథకం ద్వారా ఈ సహాయక పరికరాలను అందించనున్నారు. స్క్రీనింగ్ శిబిరంలో పాల్గొనడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సదరం సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు, వైకల్యం తెలిపే రెండు ఫొటోలు సమర్పించాలి.
ఈ స్క్రీనింగ్ ప్రక్రియ ఈ నెల 26తో పూర్తవుతుంది. అర్హులైన వారి జాబితాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తారు. ఆ తర్వాత అర్హులైన దివ్యాంగులకు సహాయక పరికరాలను అందజేయనున్నారు. అందులో మూడు చక్రాల బండ్లు, వీల్‌ఛైర్లు, వినికిడి యంత్రాలు, చంక కర్రలు వంటి పరికరాలు ఉంటాయి. దృష్టి లోపం ఉన్న వారికి ప్రత్యేక టీఎల్‌ఎం కిట్లు, అలాగే మానసిక దివ్యాంగులకు అవసరమైన టీఎల్‌ఎం కిట్లు అందించనున్నారు. ఈ చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన సౌకర్యాలు అందించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది.