దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఈ ఉదయం పలు పాఠశాలలకు గుర్తుతెలియని వ్యక్తులు బాంబు హెచ్చరికలతో ఈమెయిళ్లు పంపారు. మాలవీయ నగర్‌లోని ఎస్‌కేవీ పాఠశాల, ప్రసాద్ నగర్‌లోని ఆంధ్ర స్కూల్‌కి కూడా ఈమెయిళ్లు అందడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆయా పాఠశాలల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
ఇది కొత్తేమీ కాదు. కేవలం రెండు రోజుల క్రితం ద్వారకలోని డీపీఎస్‌కి కూడా ఇలాగే బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది. గత నెలలో అయితే 50కి పైగా పాఠశాలలకు ఒకేసారి బెదిరింపు ఈమెయిళ్లు పంపి సంచలనం సృష్టించారు.
వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈమెయిళ్ల వెనుక ఉన్నవారిని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, భయపడవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
         
         
         
         
         
         
         
        