ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో రెండు కొత్త జాతీయ రహదారులను ప్రారంభించారు. సుమారు రూ. 11 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రహదారులను దేశానికి అంకితం చేశారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే మరియు అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ కారిడార్ ద్వారా ఢిల్లీ అభివృద్ధి కొత్త దిశగా సాగుతోందని ప్రధాని పేర్కొన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదంతో వికసిత్ భారత్ వైపు ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు.
ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభంతో నోయిడా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 76 కిలోమీటర్ల అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ కారిడార్‌ను నిర్మించారు. అదేవిధంగా, అలీపూర్ నుంచి మహిపాల్‌పూర్ వరకు రహదారి పనులు కూడా పూర్తి చేశారు. దీంతో ఢిల్లీ శివార్లలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయి.
రూ. 7,716 కోట్లతో నిర్మించిన ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే ముండ్కా, బక్కర్ వాలా, నజాఫ్‌గఢ్, ద్వారకాలను కలుపుతూ 6 లైన్ల హైవేగా తీర్చిదిద్దబడింది. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో గురుగ్రామ్ నుంచి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకు ప్రయాణం సులభమవుతుంది. ఢిల్లీ రింగ్ రోడ్డులోని ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
అలాగే ఢిల్లీ–చండీగఢ్, ఢిల్లీ–రోహ్‌తక్ మార్గాలను ఈ అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ కారిడార్ కలుపుతోంది. దీంతో ఢిల్లీ–ఎన్సీఆర్ పశ్చిమ ప్రాంతాల ప్రజలకు ప్రయాణం మరింత సులభం కానుంది. ఇంతవరకు ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఉండేది, అయితే కొత్త రహదారులు ఆ సమస్యను అధికంగా పరిష్కరించనున్నాయి. మొత్తంగా, ఢిల్లీ అభివృద్ధికి ఇది ప్రతిరూపమని ప్రధాని మోదీ అన్నారు.