8వ వేతన సంఘం (8th Pay Commission)పై ఉద్యోగులు, పింఛన్‌దారుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, డీఏ ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే వేతనాలు పెరగడమే కాకుండా, పింఛన్లలో కూడా గణనీయమైన లాభం కలుగుతుందని ఉద్యోగ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
వేతనాల పెంపు విషయంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషిస్తుంది. నివేదికల ప్రకారం ఉద్యోగుల జీతాలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశముంది. ఏడో వేతన సంఘంలో మొత్తం జీతాల పెంపు 14.27 శాతం మాత్రమే ఉండగా, ఈసారి మరింత పెంపు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.90గా నిర్ణయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కరువు భత్యం (డీఏ) కూడా గణనీయంగా పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం 55 శాతం ఉన్న డీఏ, 2026 జనవరి నాటికి 60–62 శాతాలకు పెరగనుంది. దీంతో పాటు కొత్త వేతన సంఘం కింద ఉద్యోగులకు 18 శాతం వరకు అదనంగా జీతాలు పెరుగుతాయని సమాచారం. ఈ పెంపులు అమల్లోకి వస్తే ఉద్యోగులకు డబుల్ లాభం దక్కనుంది.
8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది.అయితే దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి 15 నుంచి 18 నెలలు పట్టే అవకాశం ఉంది. ఇందుకోసం 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ముందున్న కాలం మరింత ఊరటను అందించనుంది.