ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒక పథకాన్ని పునరుద్ధరించడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ను అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈసారి కిట్‌లో కొత్తగా రెండు వస్తువులను చేర్చారు. దీంతో ఇప్పటివరకు ఉన్న 11 వస్తువులకు అదనంగా ఫోల్డబుల్ బెడ్, బ్యాగ్ కలిపి మొత్తం వస్తువుల సంఖ్య 13కి పెరిగింది. ఈ మార్పుతో ఒక్కో కిట్ ఖర్చు రూ.1,504 నుంచి రూ.1,954కి పెరిగింది. అంటే అదనంగా రూ.450 వ్యయం అవుతుంది. తల్లులు, శిశువులకు అవసరమైన అన్ని రకాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో అందించిన ఎన్టీఆర్ బేబీ కిట్‌లో దోమ తెరతో కూడిన పరుపు, వాటర్ ప్రూఫ్ షీటు, శిశువుల దుస్తులు, న్యాప్కిన్లు, తువాలు, సబ్బు, సబ్బు పెట్టె, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మ లాంటివి ఉండేవి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఫోల్డబుల్ బెడ్, ఒక బ్యాగ్ చేర్చారు. తాజాగా సీఎం చంద్రబాబు స్వయంగా కిట్‌ను పరిశీలించి మార్పులు సూచించారు. దీంతో ఈ పథకం మరింత బలోపేతం అవుతోంది. ఈ పథకం అమలు కోసం వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
2016లో అప్పటి టిడిపి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి సంవత్సరం సుమారు 3.20 లక్షల మంది తల్లులకు ఈ కిట్‌లు అందుతాయి. శిశువుల ఆరోగ్య సంరక్షణ, తల్లులకు ప్రాథమిక సౌకర్యాలు అందించడం ఈ పథకం లక్ష్యం. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం కొన్నాళ్లు నడిపినా, తర్వాత ఆపేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ సారి కిట్‌ల సరఫరా కోసం ఏపీఎంఎస్ఐడీసీ కొత్త టెండర్లు పిలవడానికి సిద్ధమవుతోంది. రూ.65 కోట్ల అంచనా వ్యయంతో రాబోయే రెండేళ్లపాటు 26 జిల్లాలకు రేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో సరఫరా చేయనుంది.
ఇప్పటికే జూన్‌లో టెండర్లు పిలవగా చాలా కంపెనీలు ఆసక్తి చూపించాయి. కానీ కొత్తగా రెండు వస్తువులు చేర్చడం వల్ల మళ్లీ టెండర్లు పిలవాల్సి వస్తోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే కిట్‌ల సరఫరా ప్రక్రియ మొదలవుతుంది. మొత్తంగా, ఎన్టీఆర్ బేబీ కిట్‌లు తల్లులకు భరోసా కల్పించడమే కాకుండా, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే విలువైన పథకంగా మరోసారి తిరిగి రానుంది. ప్రజలకు ఇది దసరా కానుకలా మారనుంది.