గత ప్రభుత్వం అమలు చేసిన తప్పుడు, అక్రమ కేసులపై శాసన మండలిలో చర్చ జరిగింది. కొణిదెల నాగబాబు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో అమరావతి రైతులు రాజధాని కోసం పోరాడితే వందలాది మందిపై కేసులు పెట్టారని, తన పైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంతో కడప కోర్టుకు నేను హాజరయ్యానని అన్నారు.
గత ప్రభుత్వ చీకటి జీవోలు తెచ్చే సంస్కృతిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొనసాగించదని స్పష్టం చేశారు. అన్ని కేసులను లా ప్రకారం పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యమించిన టీచర్లపై నమోదైన కేసుల్లో 80 శాతం ఎత్తివేశామని, మిగిలిన కేసుల పరిష్కారానికి కూడా చర్యలు కొనసాగుతున్నాయని ఆమె వెల్లడించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019 నుండి 2024 మధ్యకాలంలో మొత్తం 3,116 తప్పుడు కేసులు పెట్టిందని హోంమంత్రి వంగలపూడి అనిత శాసనమండలిలో వెల్లడించారు. ఈ కేసుల్లో రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అభిప్రాయాలు వ్యక్తం చేసిన సాధారణ ప్రజలపై కూడా కేసులు పెట్టారని ఆమె చెప్పారు.
కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకే లేదా ఫార్వార్డ్ చేసినందుకే ప్రజలపై కేసులు పెట్టారు అని ఆమె విమర్శించారు. అమరావతి రైతులు రాజధాని కోసం చేసిన ఉద్యమంలో వందలాది కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ కేసుల్లో కొన్ని విచారణ దశలో ఉండగా, మరికొన్ని ట్రయల్ పెండింగ్ లో ఉన్నాయి.
కొన్ని కేసులు కోర్టుల పరిధిలో విచారణలో ఉన్నాయి అని వివరించారు. ఈ వ్యవహారంపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తారని హోంమంత్రి తెలిపారు.
పోలీస్ శాఖ, న్యాయ శాఖలతో సమన్వయంగా సమావేశమై కేసుల పరిష్కారంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. అంతేకాకుండా ఇటీవల సాక్షి పత్రికలో ఎన్డీయే కూటమి సభ్యుల్లో 94 శాతం మందిపై కేసులున్నాయన్న వార్తలపై స్పందిస్తూ, వారు గుర్తించాల్సింది ఒక్కటే – మా నాయకులపై కోడి కత్తి కేసులు, గొడ్డలి వేటు కేసులు, లేదా తల్లి, చెల్లెలు పేరుతో పెట్టిన పర్సనల్ కేసులు లేవు.
ఇవన్నీ రాజకీయ కేసులే. గత ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎత్తిచూపినందుకు మాత్రమే ఈ కేసులు నమోదయ్యాయి అని హోంమంత్రి స్పష్టం చేశారు.