వైసీపీ హయాంలోనే రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయులు పెట్టి.. ఇప్పుడు ఏవిధంగా మాట్లాడతారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా.. ఛైర్మన్ తిరస్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. బీఏసీలో ఈ అంశంపై చర్చకు ఎందుకు లేవనెత్తలేదని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం దిగేనాటికి రూ.4వేల కోట్లు బకాయిలు పెట్టారు. కోవిడ్ సమయంలో రూ.644 కోట్లు ఎగ్గొట్టారు. ఆర్టీఎఫ్ కింద 3వేల కోట్లు పెండింగ్ లో పెట్టారు.
ఎంటీఎఫ్ కింద 895 కోట్లు పెండింగ్ లో పెట్టారు. 2024-25 ఏడాదికి వచ్చేసరికి కూటమి ప్రభుత్వంలో రూ.1,200 కోట్లు విడుదల చేశాం. పెండింగ్ లో ఉన్న రూ.1,400 కోట్లు వచ్చే మూడు నెలల్లో విడుదల చేస్తాం. వైసీపీ హయాంలో రూ.4వేల కోట్లు బకాయిలు పెట్టి ఇప్పుడు ఏవిధంగా మాట్లాడతారని కౌంటర్ ఇచ్చారు.
దీనిపై వైసీపీ మండలి పక్షనేత బొత్స చర్చకు పట్టుబట్టగా.. బీఏసీలో ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదని మంత్రి ఎండగట్టారు. కనీసం ఈ అంశాన్ని అడగలేదని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై చర్చకు సిద్ధమని, సభను వైసీపీ సభ్యులు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
తమ డొల్లతనం బయటపడుతుందనే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల అంశాన్ని బీఏసీలో లేవనెత్తలేదని చెప్పారు. విద్యారంగంపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో విద్యారంగంపై చర్చ సందర్భంగా బొత్స సత్యనారాయణ, ఇతర వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారని గుర్తుచేశారు.
వైసీపీ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. దీనిపై చర్చకు సిద్ధం. సరైన ఫార్మాట్ లో రావాలని సూచించారు. బొత్స స్పందిస్తూ.. సభలో పరుషపదాలు వినియోగించరాదని చెప్పారు.
దీనిపై మంత్రి స్పందిస్తూ.. పరుషపదాలు ఏం వినియోగించానో చెప్పాలని, ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదన్నారు. బొత్స గారని తాను సంబోధించానని స్పష్టం చేశారు. అందరినీ తాను గౌరవిస్తానని చెప్పారు.