తిరుమల కొండ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల సెప్టెంబర్ 24 నుంచి జరగనున్న ఈ ఉత్సవాలకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, సౌకర్యవంతంగా శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లు, సౌకర్యాల గురించి తెలుసుకుంటే భక్తులు తమ యాత్రను సులభంగా, వేగంగా పూర్తి చేసుకోవచ్చు.
బ్రహ్మోత్సవాల్లో సేవలు, సౌకర్యాలు:
వసతి సౌకర్యాలు: భక్తుల కోసం యాత్రికుల వసతి సముదాయం (PAC)-1, PAC-2, PAC-3, పద్మనాభ నిలయం వంటి వాటిల్లో లాకర్ల సదుపాయం, వసతి కల్పించారు. ఈనెల 25న సీఎం చంద్రబాబు ప్రారంభించిన తర్వాత PAC-5 కూడా అందుబాటులోకి రానుంది.
వైద్య సేవలు: భక్తులకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే స్పందించేందుకు వీలుగా తిరుమలలోని టీటీడీ అశ్విని ఆసుపత్రితో పాటు అపోలో అత్యవసర వైద్య చికిత్స కేంద్రం అందుబాటులో ఉంటుంది. అలాగే, దక్షిణ మాడవీధిలో 10-12 పడకలతో అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటు చేశారు. మాడవీధుల్లో ఎనిమిది అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. స్విమ్స్, రుయా నుంచి 50 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బంది సేవలు అందిస్తారు.
అన్నప్రసాదాలు: భక్తుల ఆకలి తీర్చేందుకు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్, రాంభగీచా, సుదర్శన్, ఏఎన్‌సీ ప్రాంతాల్లో కూడా నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తారు.
తలనీలాలు సమర్పించడం: భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ప్రధాన కల్యాణకట్టతో పాటు జీఎన్సీ, హెచ్‌పీసీ, ఎస్వీ గెస్ట్ హౌస్, సప్తగిరి, వరాహస్వామి, నందకం అతిథిగృహాలు, యాత్రికుల వసతి సముదాయాల్లోని కల్యాణకట్టలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 1150 మంది క్షురకులు సేవలు అందిస్తారు.
సమాచార కేంద్రాలు: యాత్రికులకు సమాచారం అందించేందుకు రాంభగీచా, షాపింగ్ కాంప్లెక్స్, ఏటీసీ ఏరియా వంటి పది ప్రదేశాల్లో సమాచార సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి వంద మీటర్లకు ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
భద్రత, పార్కింగ్ ఏర్పాట్లు:
బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రెండు వేల మంది టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, 4700 మంది పోలీసు సిబ్బంది, 450 మంది సీనియర్ అధికారులు, 3 వేల సీసీ కెమెరాలను వినియోగించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రాంతం (తిరుపతి):
అలిపిరి లింక్ బస్టాండ్
నెహ్రూ మున్సిపల్ మైదానం
ఇస్కాన్ మైదానం
ఎస్వీ వైద్య కళాశాల మైదానం
భారతీయ విద్యాభవనం
ఏపీ టూరిజం ఓపెన్ ఏరియా
ద్విచక్ర వాహనాలు: 2000
కార్లు: 500
తిరుమలలో వాహనాల పార్కింగ్ నిండితే, తిరుపతిలోనే పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అలిపిరి బస్టాండ్ వద్ద 500 బస్సులను సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లన్నింటినీ సద్వినియోగం చేసుకుని భక్తులు శ్రీవారి ఆశీస్సులు పొందాలని ఆశిద్దాం.