హైదరాబాద్ నగరంలో పేదల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఇందిరమ్మ క్యాంటీన్లను నేడు (సెప్టెంబర్ 29, 2025) ప్రారంభించారు. ఈ క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం కేవలం రూ.5కే అందించనున్నారు. ఈ పథకం ద్వారా బస్తీల్లో నివసించే ప్రజలు, రోజువారీ కూలీలు, విద్యార్థులు, చిన్న ఉద్యోగులు ఆరోగ్యకరమైన ఆహారం తక్కువ ధరకే పొందే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.
మోతీనగర్ మింట్ కాంపౌండ్‌లో ఉన్న క్యాంటీన్‌లో ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. మొదటగా నగరంలోని 60 ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ప్రారంభమవుతాయి అవుతాయని తెలిపారు.
అదేవిధంగా మరో 150 ప్రాంతాలకు ఈ పథకం విస్తరించనున్నట్టు GHMC వెల్లడించింది. ప్రతిరోజూ సుమారు 25 వేల మందికి మిల్లెట్ ఆధారిత పోషకాహార అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి రోజు వేరువేరు వంటకాలను అందించేందుకు ప్రత్యేక పట్టిక సిద్ధం చేశారు. ఇందులో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ వంటి వంటకాలు ఉంటాయని తెలిపారు. క్యాంటీన్లు వారానికి ఆరు రోజులు మాత్రమే పనిచేస్తాయని ఆదివారం సెలవు ఉంటుంది. ఒక టిఫిన్ తయారీకి దాదాపు రూ.19 ఖర్చవుతుంది. అందులో రూ.5 మాత్రమే ప్రజల నుంచి తీసుకుంటున్నామని తెలిపారు. మిగిలిన రూ.14ను GHMC భరిస్తుంది అని వివరించడం జరిగినది.
హైదరాబాద్‌లో 2013లో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రూ.5 భోజన పథకం ప్రారంభమైంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అది చాలా విజయవంతమైంది. పేదల ఆకలి తీర్చడంలో ఈ పథకం ఎంతగానో తోడ్పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ క్యాంటీన్ 139 నుండి 150కి పెంచారు. ఇప్పుడు అదే పథకాన్ని ఇందిరమ్మ క్యాంటీన్ పేరుతో మరింత విస్తరించి అల్పాహారం, మధ్యాహ్న భోజనం రెండింటినీ అందిస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ఇతర రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ లో చిన్నాచితక ఉద్యోగాలు చేస్తూ తాము తినకుండా తమ సంపాదించిన దానిని కుటుంబానికి పంపించేవారు అటువంటి వారికి ఈ పథకం ఒక గొప్ప వరం అని అక్కడ ఉన్న ప్రజలు తమ భావాలను వ్యక్తపరిచారు.
అందులోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిల్లెట్స్ తో అల్పాహారం ఇవ్వడం భోజనం పెట్టడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అని ఈ రోజుల్లో మిల్లెట్స్ తో బయట టిఫిన్ చేయాలంటే కనీసం 150 రూపాయలు అయినా కావాలని అక్కడ ప్రజలు తమ అభిప్రాయాలను ద్వారా పంచుకున్నారు.