రాజధాని అమరావతిలో మరో కొత్త చరిత్ర రాయబోతోందని చెప్పుకోవాలి. మంగళగిరి మండలం నీరుకొండ కొండపై 300 అడుగుల ఎత్తైన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు నటుడిగా, నాయకుడిగా చిరస్మరణీయమైన వ్యక్తి. ఆయనకు గుర్తుగా ఇంత పెద్ద విగ్రహాన్ని నిర్మించడం వల్ల అమరావతి పర్యాటకానికి కూడా కొత్త ఊపు వస్తుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ విగ్రహానికి వంద అడుగుల ఎత్తైన పాదపీఠం నిర్మించి, దాని పైభాగంలో రెండు వందల అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది.
రాజధాని ప్రాంతంలో ఎక్కడినుంచైనా ఈ విగ్రహం స్పష్టంగా కనపడేలా డిజైన్ చేయనున్నారు. విగ్రహ పాదపీఠంలో ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఇందులో మినీ థియేటర్, మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్ కూడా ఉండబోతున్నాయి.
ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన సినిమాలు, డాక్యుమెంటరీలు, మ్యూజియంలో ఆయన సినిమాలు, రాజకీయ జీవితం, తెలుగు ప్రజల కోసం చేసిన సేవలకు సంబంధించిన అరుదైన ఫోటోలు, వస్తువులు ప్రదర్శనకు బహుశా ఉండొచ్చేమో. కన్వెన్షన్ సెంటర్‌లో పెద్ద స్థాయి సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇది మొదటిసారి కాదు గతంలోనే అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అప్పటి టిడిపి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై మళ్లీ ముందడుగు వేసింది.
రాజధాని అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న ఈ విగ్రహ ప్రాజెక్టులు, స్మారక వనాలు భవిష్యత్తులో అమరావతిని దేశంలోనే ప్రత్యేక పర్యాటక కేంద్రంగా నిలిపే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.