⚡ BREAKING
S Janaki: గాన కోకిల ఇక లేరు.. తెలుగు గడ్డపై జననం.. కన్నడ, మలయాళ గుండెల్లో స్థానం.. మధుర గాయని గుండెపోటుతో కన్నుమూత!  •  Cristiano Ronaldo: రొనాల్డో ట్వీట్‌పై భగ్గుమన్న నెటిజన్లు.. కెరీర్ చివరి ప్రపంచకప్ ముగిశాక పెరిగిన సోషల్ మీడియా హీట్!  •  Raashii Khanna: షూటింగ్‌లో గాయపడ్డ రాశి ఖన్నా.. బాలీవుడ్ సెట్‌లో యాక్షన్ సీన్ చేస్తుండగా... ఆందోళనలో అక్కినేని, మెగా ఫ్యాన్స్!  • 

Modi: భారత్-న్యూజిలాండ్ సంబంధాల్లో కొత్త అధ్యాయం.. ఐదు కీలక ఒప్పందాలపై సంతకాలు!

Mdoi: భారత్-న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, పశుసంవర్ధక-పాడి పరిశ్రమ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ రంగాలకు సంబంధించిన ఐదు కీలక అవగాహన ఒప్పందాల (MoUs)పై సంతకాలు చేశాయి.

Modi In New Zealand
Modi In New Zealand

మోదీ న్యూజిలాండ్ పర్యటన ఫలితం.. రక్షణ సహా ఐదు రంగాల్లో కీలక ఒప్పందాలు..

భారత్-న్యూజిలాండ్ బంధాలకు కొత్త ఊపు.. ఐదు అవగాహన ఒప్పందాలపై సంతకాలు..

ఆక్లాండ్: భారత్-న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, పశుసంవర్ధక-పాడి పరిశ్రమ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ రంగాలకు సంబంధించిన ఐదు కీలక అవగాహన ఒప్పందాల (MoUs)పై సంతకాలు చేశాయి. ఆక్లాండ్లో ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ నేతృత్వంలో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి.

రక్షణ రంగంలో సముద్ర భద్రతకు ప్రాధాన్యం
భారత్ రక్షణ మంత్రిత్వ శాఖ, న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా సముద్ర భద్రత, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం మరింత బలోపేతం కానుంది. ఈ ఒప్పందం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని అధికారులు తెలిపారు.

పాడి పరిశ్రమ, పర్యాటకానికి ఊతం
పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి కోసం పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ విధానాల పరస్పర మార్పిడికి ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే పర్యాటక రంగ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య పర్యాటకుల రాకపోకలు పెరగడంతో పాటు టూరిజం రంగంలో సహకారం విస్తరించనుంది.

క్రీడలు, విపత్తు నిర్వహణలో సహకారం
క్రీడల అభివృద్ధి, క్రీడాకారుల పరస్పర మార్పిడి కోసం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఇరు దేశాలు ఆమోదించాయి. అలాగే విపత్తుల సమయంలో సన్నద్ధత, అత్యవసర సహాయక చర్యలు, విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదిరింది.

వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం
చర్చల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, తన న్యూజిలాండ్ పర్యటన భారత్-న్యూజిలాండ్ సంబంధాల్లో చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని న్యూజిలాండ్ను సందర్శించడం ఇరు దేశాల బంధం బలపడుతున్నదానికి నిదర్శనమని అన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ప్రక్రియను వేగంగా పూర్తి చేసినందుకు న్యూజిలాండ్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటి నుంచి ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వాములుగా కలిసి పనిచేస్తాయని, ప్రజాస్వామ్య విలువలు, సముద్ర సంబంధాలు భారత్-న్యూజిలాండ్లను మరింత దగ్గర చేస్తాయని మోదీ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతను బలోపేతం చేయడంలో రెండు దేశాలు కీలక పాత్ర పోషించగలవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

చారిత్రక పర్యటనగా అభివర్ణించిన లక్సన్
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ, 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని తమ దేశాన్ని సందర్శించడం చారిత్రక ఘట్టమని అన్నారు. ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు గౌరవంగా ఉందని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలు కేవలం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికే పరిమితం కావని, పలు కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఘన స్వాగతం.. త్రివర్ణ కాంతుల్లో స్కై టవర్
ప్రతినిధి స్థాయి చర్చలకు ముందు గవర్నమెంట్ హౌస్లో ప్రధాని మోదీకి గౌరవ వందనం నిర్వహించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులతో సమావేశం కానున్నారు. అలాగే న్యూజిలాండ్లోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు.

మూడు దేశాల పర్యటనలో చివరి దశగా ఆస్ట్రేలియా, ఇండోనేషియా పర్యటనలు విజయవంతంగా ముగించుకుని ప్రధాని మోదీ ఆక్లాండ్ చేరుకున్నారు. ప్రత్యేక గౌరవ సూచకంగా న్యూజిలాండ్ ప్రధాని స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి మోదీకి స్వాగతం పలికారు. భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం అందించారు.

ప్రవాస భారతీయులు విదేశాల్లోనూ భారత సంస్కృతి, సంప్రదాయాలను సజీవంగా నిలబెడుతున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు భారత వైవిధ్యాన్ని ప్రతిబింబించాయని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని మోదీ చారిత్రక పర్యటనకు గుర్తుగా న్యూజిలాండ్లోని ప్రముఖ స్కై టవర్ భారత జాతీయ పతాకం త్రివర్ణ రంగులతో ప్రకాశించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ దృశ్యాలను పంచుకుంటూ, ఇది భారత్-న్యూజిలాండ్ స్నేహానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయని ఇరు దేశాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Be the first to react

Latest