గతంలో బంగారానికి మాత్రమే పరిమితమైన పెట్టుబడిదారుల ఇప్పుడు ఆసక్తి వేగంగా వెండివైపు మళ్లుతోంది. 2025 ఏడాది మొత్తం చూస్తే వెండి ధరల్లో ఏకంగా 181 శాతం వరకు పెరుగుదల నమోదైంది. డిసెంబరు చివర్లో ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.2.5 లక్షల స్థాయిని తాకడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కొద్ది నెలల క్రితం వరకు ఈ స్థాయి ఊహకే అందని పరిస్థితి ఉండగా, ఇప్పుడు అదే కొత్త రికార్డుగా మారింది.
వెండి ధరలు ఇలా ఎగబాకడానికి ప్రధాన కారణం పారిశ్రామిక రంగం నుంచి వస్తున్న భారీ డిమాండ్. సాధారణంగా బంగారాన్ని ఆభరణాలు, పెట్టుబడులకే ఎక్కువగా వాడుతారు. కానీ వెండి మాత్రం ఆభరణాలతో పాటు పరిశ్రమలకు ప్రాణంగా మారింది. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వైద్య సాధనాలు, బ్యాటరీలు, విద్యుత్ ఉపకరణాలు, సోలార్ ప్యానల్స్ తయారీలో వెండి కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా విద్యుత్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో వెండి అవసరం రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు అభివృద్ధి చెందని దేశాలుగా భావించిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఫ్యాక్టరీలు, తయారీ కేంద్రాలు ఏర్పడుతున్నాయి. దీని ప్రభావం వెండి మార్కెట్‌పై నేరుగా పడుతోంది. కొత్త పరిశ్రమ అంటే కొత్త డిమాండ్. ఈ డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడమే ధరల పెరుగుదలకు మరో పెద్ద కారణంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వెండి ఉత్పత్తి కొన్ని దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంది. ముఖ్యంగా మెక్సికో, చైనా, పెరూ, చిలీ వంటి దేశాల నుంచి వచ్చే సరఫరాపైనే అంతర్జాతీయ మార్కెట్ ఆధారపడుతోంది.
ఇందులో కీలకమైన అంశం చైనా వ్యూహం. వెండి రిఫైనింగ్, ప్రాసెసింగ్‌లో చైనా ప్రపంచాన్ని శాసిస్తోంది. రాబోయే కాలంలో తమ దేశీయ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు విధించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి సరఫరా మరింత తగ్గే అవకాశం ఉంది. సరఫరా తగ్గితే ధరలు పెరగడం సహజం.
మరోవైపు, అమెరికా ఆర్థిక విధానాలు కూడా వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు పెట్టుబడిదారులు బ్యాంకు డిపాజిట్ల కంటే లోహాలవైపు మొగ్గుచూపుతారు. ఈ పరిస్థితుల్లో వెండి లాంటి లోహాలకు డిమాండ్ పెరుగుతుంది. 2026 ఏడాదిపై అంచనాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుత డిమాండ్, సరఫరా పరిస్థితులు అలాగే కొనసాగితే వచ్చే ఏడాది వెండి ధర మరింత ఎగబాకే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొందరు విశ్లేషకులు కిలో వెండి ధర రూ.3 లక్షలు దాటవచ్చని అంచనా వేస్తుండగా, మరికొందరు అయితే రూ.4 లక్షల దాకా వెళ్లొచ్చని అంటున్నారు.