ఆస్ట్రేలియా ప్రభుత్వం చిన్న పిల్లలను సోషల్ మీడియా ప్రభావం నుండి రక్షించేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వినియోగాన్ని నిషేధిస్తూ కొత్త చట్టాన్ని అమలు చేసింది. ఇది ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచింది. ఈ నిషేధం ఇప్పటికే అమల్లోకి వచ్చి, టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్‌తో పాటు మెటా, ఆల్ఫాబెట్, బైట్‌డ్యాన్స్‌కు చెందిన అనుబంధ యాప్‌లన్నీ ఇందులో చేరాయి. చిన్న పిల్లలు ఈ యాప్‌లలో ఖాతా సృష్టించడం, కంటెంట్ బ్రౌజ్ చేయడం, నోటిఫికేషన్‌లు పొందడం అన్నీ పూర్తిగా నిలిపివేయాల్సిందే అని కంపెనీలకు ఆదేశాలను జారీ చేసింది ఒకవేళ కంపెనీలు ఈ ఆదేశాలను పాటించకపోతే 275 కోట్ల రూపాయల వరకు జరిమానా పడే అవకాశం ఉందని తెలిపారు.
గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై చూపుతున్న ప్రతికూల ప్రభావాలపై అనేక అధ్యయనాలు వెలువడ్డాయి. రోజుకు మూడు నుండి ఐదు గంటల వరకు చిన్న పిల్లలు రీల్స్, వీడియోలు, గేమింగ్, చాటింగ్ వంటి కార్యకలాపాలపై గడపడం సాధారణంగా మారిపోయింది. దీని వల్ల నిద్రలోపం, ఏకాగ్రత తగ్గడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, చదువుపై దృష్టి తగ్గడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఆన్‌లైన్ బుల్లీయింగ్ కూడా పెరుగుతోంది. కొన్నిరిపోర్ట్‌ల ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లల్లో 30 నుంచి 40 శాతం వరకు ఏదో ఒక రకమైన ఆన్‌లైన్ వేధింపులకు గురయ్యారని సర్వేలు తెలుపుతున్నాయి.
ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించింది. తల్లిదండ్రుల సంఘాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. సోషల్ మీడియా వల్ల పిల్లలు కుటుంబం, చదువు, మానవ సంబంధాలు నుంచి దూరమైపోతున్నారని, ఎక్కువగా ఒంటరిగా మారుతున్నారని వారు తెలిపారు. పిల్లలకు బాల్యాన్ని తిరిగి ఇవ్వాలంటే, డిజిటల్ వ్యసనాన్ని తగ్గించాల్సిన సమయం వచ్చిందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక శాసనసభలు కూడా పూర్తిగా మద్దతు ఇచ్చాయి.
అయితే టెక్నాలజీ కంపెనీలు మాత్రం ఈ నిర్ణయంపై అసంతృప్తిగా స్పందించాయి. ఈ చట్టం ఇంటర్నెట్ స్వేచ్ఛను తగ్గిస్తుందని, వయో ధృవీకరణ వ్యవస్థను అమలు చేయడం సాంకేతికంగా చాలా క్లిష్టమని కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. అలాగే పిల్లల అభివ్యక్తి స్వేచ్ఛపై పరిమితి విధించడం సరైంది కాదని కొంతమంది న్యాయవాదులు వాదించారు. ఇలాంటి పెద్ద నిషేధం కన్నా నియంత్రణలు, పర్యవేక్షణతో కూడిన సాఫ్ట్ పాలసీలు మంచివని వారి అభిప్రాయం.
కానీ ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ మాత్రం పిల్లల భద్రతకు ఇది అత్యవసరమని అన్నారు. సోషల్ మీడియా వ్యసనం పిల్లల జీవితాలను ప్రభావితం చేస్తున్నందున, కఠిన చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. కుటుంబంతో గడిపే సమయం పెరగడం, పాఠశాల విద్యపై దృష్టి పెరగడం, నిజ జీవిత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం వంటి ప్రయోజనాలు ఈ నిర్ణయంతో కనబడతాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇంకా పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించే మరిన్ని సంస్కరణలను పరిశీలిస్తోంది.
ఈ చట్టం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. యూరప్, కెనడా, జపాన్ వంటి దేశాలు కూడా పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కొత్త నిబంధనలు తీసుకురావాలా అనే విషయంలో ఆలోచిస్తున్నాయి. గ్లోబల్ స్థాయిలో డిజిటల్ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెరుగుతున్న నేపథ్యంలో, ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం మరిన్ని దేశాలకు మార్గదర్శకంగా నిలవొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.