ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా ముగ్గురు కళాకారులు జాతీయ హస్తకళ అవార్డులను అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023, 2024 సంవత్సరాల జాతీయ హస్తకళల అవార్డులను ప్రదానం చేశారు. తమ తమ రంగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబరచిన ఈ కళాకారులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
2023 సంవత్సరానికి ‘శిల్ప గురు’ అవార్డును ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన డి. శివమ్మ అందుకున్నారు. ఆమె తోలు మీద రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణ లీలలు వంటి పురాణ కథలను అద్భుతంగా చిత్రీకరించడంలో ప్రావీణ్యం కలిగిన కళాకారిణి. భారతీయ సంప్రదాయ కళను తన ప్రత్యేక శైలిలో ప్రపంచానికి పరిచయం చేసినందుకు ఆమెను కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది.
ఏటికొప్పాక బొమ్మల తయారీలో నైపుణ్యం చూపిన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన గోర్సా సంతోశ్ 2024 సంవత్సరానికి జాతీయ హస్తకళ అవార్డును అందుకున్నారు. దేశంలో ప్రసిద్ధి పొందిన ఏటికొప్పాక బొమ్మల కళను ముందుకు తీసుకెళ్లడంలో సంతోష్ ముఖ్య పాత్ర పోషించారు.
కలన్కారి చేతి పెయింటింగ్‌లో విశేష కృషి చేసిన నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం కుప్పం గ్రామానికి చెందిన పి. విజయలక్ష్మి 2023 సంవత్సరానికి జాతీయ హస్తకళ అవార్డుకు ఎంపికయ్యారు. సంప్రదాయ కలంకారి కళను సృజనాత్మకంగా రూపాంతరం చేసి కొత్త తరానికి పరిచయం చేసినందుకు ఆమె ఈ గౌరవం పొందారు.