గూగుల్ క్రోమ్‌లో తాజాగా ప్రవేశపెట్టిన ఏజెంటిక్ సౌకర్యాలు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఫీచర్లు బ్రౌజర్‌ను సాధారణ శోధన సాధనంగా కాకుండా, స్వయంగా వినియోగదారుడి తరఫున పనులు నిర్వహించగల స్మార్ట్ అసిస్టెంట్‌గా మార్చుతున్నాయి. భవిష్యత్తులో వెబ్‌లో అపాయింట్‌మెంట్లు బుక్ చేయడం, ఆన్‌లైన్ షాపింగ్ ఆర్డర్‌లు ఇవ్వడం, సేవల కోసం ఫారమ్‌లు నింపడం వంటి పనులను క్రోమ్ స్వయంగా పూర్తి చేయగల సామర్థ్యం పొందుతుంది. అయితే ఈ కొత్త అవకాశాల నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులు జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు.
ఏజెంట్ స్వతంత్రంగా పనిచేయడం వల్ల, తప్పు సూచనలు లేదా హానికరమైన దాడులు జరిగే అవకాశం ఉండొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. గూగుల్ మాత్రం ఈ ఆందోళనలను తగ్గించే దిశగా పలు భద్రతా పొరలను అమలు చేస్తోంది. ముఖ్యంగా యూజర్ అలైన్‌మెంట్ క్రిటిక్ అనే ప్రత్యేక AI మోడల్ ఈ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏజెంట్ తీసుకునే ప్రతి చర్యను ఇది ముందుగా పరిశీలిస్తుంది. వినియోగదారుడు ఇచ్చిన అసలు సూచనకు ఆ చర్య నిజంగా సరిపోతుందా, సరైన ప్రయోజనానికే ఉపయోగపడుతుందా అన్నది నిర్ధారించడం దీని పని. దీనివల్ల ఏజెంట్ తప్పుదారి పడకుండా అడ్డుకోవచ్చు.
గూగుల్ ఈ మోడల్‌కు పూర్తి వెబ్ కంటెంట్‌ను చూపించకుండా, కేవలం చర్యకు సంబంధించిన పరిమిత మెటాడేటా మాత్రమే అందిస్తోంది. దీంతో సిస్టమ్ ఉన్నదానికి మించి సమాచారాన్ని తెలుసుకోకుండా నిరోధించగలదు. ఇంకో ముఖ్యమైన రక్షణ విధానం ఆరిజిన్ ఐసోలేషన్. ఏజెంట్ పనిచేసే వెబ్‌సైట్లు వినియోగదారుడు చేస్తున్న పనికి సంబంధించిన డొమైన్‌ల వరకే పరిమితం అవుతాయి. దీంతో హానికరమైన వెబ్‌సైట్లు లేదా ఇతర థర్డ్ పార్టీ ఐఫ్రేమ్‌లు ఏజెంట్‌ను మోసగించడానికి ప్రయత్నించినా ఆ దారులు ముందుగానే మూసివేయబడతాయి. ఏజెంట్ పరికరంలో ఉన్న డేటా లేదా ఇతర వెబ్ సమాచారానికి అనవసర యాక్సెస్ కలగకుండా గూగుల్ ఈ రక్షణను రూపొందించింది.
ఇంకా వినియోగదారుడి అనుమతి లేకుండా ఏజెంట్ పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ఒక అదనపు కన్ఫర్మేషన్ సదుపాయం కూడా చేర్చారు. ఫారమ్‌లు నింపే ముందు, చెల్లింపులు చేసేముందు, లేదా వ్యక్తిగత డేటా అందించే సమయంలో బ్రౌజర్ తప్పనిసరిగా యూజర్‌ను అడుగుతుంది. ఈ విధానం కారణంగా ఏజెంట్ పొరపాట్లు చేసినా, తుది నిర్ణయం పూర్తిగా వినియోగదారుడి చేతికే వస్తుంది.
ఇవి మాత్రమే కాకుండా, ఏజెంట్ పని చేస్తూనే అనుమానాస్పద ప్రవర్తనను గుర్తించే రియల్‌టైం థ్రెట్ డిటెక్షన్ వ్యవస్థను కూడా గూగుల్ రూపొందించింది. అది ఏదైనా ప్రమాదకరమైన చర్య ఉందని గుర్తిస్తే వెంటనే ఆపగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ భద్రతా పొరలు ఎంత బలంగా పనిచేస్తున్నాయో నిరంతరం పరిక్షించేందుకు గూగుల్ రెడ్-టీమింగ్ పద్ధతిని ఉపయోగిస్తోంది. అంటే నైతిక హ్యాకింగ్ ద్వారా సిస్టమ్‌లో బలహీనతలను కనుగొని వాటిని సరిచేయడమే ఉద్దేశ్యం.
గూగుల్ అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో ఏజెంటిక్ వెబ్ యుగం వేగంగా విస్తరించబోతోంది. బ్రౌజర్ సహాయకుడిగా కాకుండా వినియోగదారుడి తరఫున నేరుగా పనులు పూర్తి చేసే ప్రధాన సాంకేతిక మౌలిక వసతిగా మారబోతుంది. అందుకే భద్రతా చర్యలను ఇప్పుడు నుంచే బలోపేతం చేయడం క్రోమ్ అభివృద్ధిలో కీలక దశగా కంపెనీ భావిస్తోంది.