ఆంధ్రప్రదేశ్‌లో సాగును లాభసాటిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రైతుల పంటలు నష్టాల్లో కాకుండా లాభాల్లోకి దారితీసే విధంగా అనేక కీలక నిర్ణయాలు వరుసగా ప్రకటిస్తోంది. ఇప్పటికే ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం, రైతుల సమగ్రాభివృద్ధి కోసం భారీ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ దిశగా రూ.40 వేల కోట్లతో జలవనరుల ప్రాజెక్టులు, పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి వంటి పనులు చేపట్టాలని ముఖ‍్యమంత్రి చంద్రబాబు తాజాగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పూర్వోదయ పథకం’ కింద లభిస్తున్న నిధులతో రాయలసీమ–ప్రకాశం జిల్లాల్లోని 92 క్లస్టర్లను రైతుల జీవనోపాధి హబ్‌లుగా మార్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు.
రోజూ శాఖావారీగా సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు, మంగళవారం సాగునీటి ప్రాజెక్టులపై కీలక సమీక్ష చేశారు. ఈ మీటింగ్‌లో పూర్వోదయ పథకం కింద చేయాల్సిన పనులు, పోలవరం–నల్లమలసాగర్ అనుసంధానం, రాయలసీమ సాగునీటి లింకులు వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రూ.40 వేల కోట్ల భారీ ప్రణాళికను విభజించి అమలు చేయాలని మండలించారు. అందులో రూ.20 వేల కోట్లు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు, మిగతా నిధులతో గ్రామీణ రోడ్లు, హైవే కనెక్టివిటీ, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధికే ప్రత్యేకంగా రూ.5 వేల కోట్ల కేటాయింపు ఉండాలని సూచించారు.
రాయలసీమను ఉద్యాన పంటల హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించింది. ఈ లక్ష్యంతో రాయలసీమ–ప్రకాశం జిల్లాల్లో 23 భారీ, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు, 1021 చెరువుల నిర్మాణం, పోలవరం–నల్లమలసాగర్ లింక్ పనులు, కృష్ణా వరద జలాలను బొల్లాపల్లికి తేవడంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. నాగార్జునసాగర్ నుంచి 50 టీఎంసీలు, పోలవరం నుంచి 200 టీఎంసీల నీటిని రాయలసీమకు మళ్లించే ప్రణాళికపై కూడా చర్చించారు. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే రాయలసీమలో నీటి కొరత శాశ్వతంగా తొలగిపోయే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల సాగునీటి ప్రాజెక్టులను కూడా సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆ ప్రాంతాలు ఉద్యాన పంటల సాగుకు అనువైనవని సూచిస్తూ, అక్కడ కూడా రూ.5000 కోట్లతో భారీ ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. నారాయణపురం–హిరమండలం ఆనకట్టల అనుసంధానం, వంశధార–నాగావళి లింక్ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే జరుగుతున్న కొన్ని పనులపై రూ.170 కోట్ల ఖర్చుతో తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మొత్తం ప్రణాళిక రైతులకు సాగునీరు మాత్రమే కాదు, సాగు ఖర్చులు తగ్గేలా, పంటల విలువ పెరిగేలా, రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచేలా ఉండబోతోంది.