ఒక స్థిరమైన ఉద్యోగం భారీ జీతం, భవిష్యత్తుకు భద్రత అన్నీ ఉన్నప్పటికీ… మనసుకు సంతృప్తి లేకపోతే జీవితం అపూర్ణమే అన్న విషయాన్ని వనతి అనే మహిళ తన నిర్ణయంతో నిరూపించారు. పదేళ్లకు పైగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్‌లో పని చేసి, సంవత్సరానికి సుమారు రూ.30 లక్షల జీతం పొందుతున్న ఆమె ఒక్కసారిగా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తిస్థాయి ట్రావెల్ వ్లాగర్‌గా మారిపోయారు. ఇప్పుడు దేశదేశాలు తిరుగుతూ, తన ప్రయాణ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ వేల మందికి ప్రేరణగా నిలుస్తున్నారు.
వనతి ఎస్ కెరీర్ మొదలైనప్పటి నుంచి అన్ని విషయాలు ప్లాన్ ప్రకారమే సాగాయి. చదువు పూర్తి చేయడం, మంచి ఉద్యోగం సంపాదించడం, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం, ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యం… సమాజం ఒక వ్యక్తి నుంచి ఆశించే ప్రతీ దశను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. అయితే ఈ ప్రయాణంలో ఎక్కడో ఒక చోట తాను తనకోసం జీవించడం మరిచిపోయాననే భావన ఆమెను వెంటాడింది. బయట నుంచి చూస్తే అన్నీ ఉన్నట్టే కనిపించినా, లోపల మాత్రం అసంతృప్తి పెరుగుతూనే ఉందని ఆమె తెలిపారు.
ఉద్యోగంలో ఉన్నప్పుడే వీకెండ్స్‌లో ట్రెక్కింగ్‌లు, చిన్న ప్రయాణాలు చేస్తూ తన ఇష్టాన్ని తీరుస్తూ వచ్చారు. కానీ ఆ క్షణాలే తనకు నిజమైన ఆనందాన్ని ఇస్తున్నాయనే విషయం ఆమెకు క్రమంగా అర్థమైంది. ఆఫీసులో అదే మీటింగ్స్, అదే ప్రాజెక్టులు, అదే టైమ్ టేబుల్… ఇవన్నీ ఒక రకమైన పంజరంలా అనిపించాయని వనతి ఓ వీడియోలో వెల్లడించారు. అప్పుడే తన జీవితంలో పెద్ద మార్పు అవసరమని నిర్ణయించుకున్నారు.
చివరకు ‘ది అన్‌టోల్డ్ ట్రైల్స్’ అనే పేరుతో ట్రావెల్ కంటెంట్ క్రియేటర్‌గా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ధైర్యం ఇచ్చేలా, అడ్వెంచర్ ట్రెక్కింగ్‌లు, ప్రకృతి అందాలను పరిచయం చేస్తూ ప్రత్యేకమైన కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. ఈ మార్గం సులభం కాదని, భయం కూడా ఉంటుందని ఆమె నిజాయితీగా అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ శక్తి ఉన్నప్పుడు, యవ్వనం ఉన్నప్పుడు ప్రపంచాన్ని చూసేయాలనే కోరిక తనను ముందుకు నడిపించిందని చెబుతున్నారు.
భవిష్యత్తు ఎలా ఉంటుందో తనకు స్పష్టత లేదని, కానీ అవసరమైతే ఐదేళ్ల తర్వాత మళ్లీ ఉద్యోగంలోకి వెళ్లగలననే నమ్మకం ఉందని వనతి తెలిపారు. ఈ ధైర్యమే ఆమెను ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని చెప్పవచ్చు. డబ్బు మాత్రమే జీవితం కాదని, సమయం, అనుభవాలు, ఆనందం కూడా అంతే విలువైనవని ఆమె కథ మరోసారి గుర్తు చేస్తోంది.
వనతి తీసుకున్న ఈ నిర్ణయానికి సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. చాలామంది ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, తమ కలల్ని కూడా ఒకసారి ఆలోచించుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే టెడ్‌ఎక్స్ స్పీకర్‌గా మారిన వనతి, సమాజపు అంచనాలను దాటి ఎలా జీవించాలో తన అనుభవాల ద్వారా వివరించుతూ ముందుకెళ్తున్నారు. ఒక సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలి, అనిశ్చితి ఉన్న మార్గాన్ని ఎంచుకున్నా… సంతృప్తి మాత్రం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పొచ్చు..