- రసాయనాలతో నెయ్యి తయారు చేశారని సిట్ రిపోర్ట్ ఇచ్చిందన్న అనిత..
- సాక్షిలో రాసే విషయాలనే వైసీపీ నేతలు మాట్లాడుతుంటారని ఎద్దేవా..
Anita Comments On TirumalaLaddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ అంశం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా మరోసారి వేడెక్కింది. దీనిపై సభలో చర్చ జరగాలని అటు వైసీపీ పట్టుబడుతుండగా, ప్రభుత్వం తరపున హోం మంత్రి వంగలపూడి అనిత గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
హోం మంత్రి అనిత గారు మాట్లాడుతూ, తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. అయితే, గాలిలో మాటలు కాకుండా పక్కా ఆధారాలతో చర్చకు రావాలని ఆమె వైసీపీకి సవాల్ విసిరారు. "ప్రజాహితం కోసం, భక్తుల నమ్మకాన్ని కాపాడటం కోసం ఎలాంటి చర్చకైనా మేము వెనుకాడం" అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఇప్పటికే ఇదే విషయాన్ని సభలో ప్రకటించారని ఆమె గుర్తు చేశారు.
సిట్ (SIT) విచారణలో తేలిన అంశాలను ప్రస్తావిస్తూ మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల సరఫరా చేసిన ఆ పదార్థం అసలు నెయ్యే కాదని, అది అనేక రసాయనాల మిశ్రమమని సిట్ నివేదికలో స్పష్టమైందని ఆమె తెలిపారు. కనీసం పాల సేకరణ కేంద్రం కూడా లేని ఒక సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్టును గత ప్రభుత్వం ఎలా ఇచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ నెయ్యిలో ఏయే రసాయనాలు కలిపారు, అది భక్తుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాలను సభలో పూసగుచ్చినట్లు వివరిస్తామని చెప్పారు. గతంలో జరిగిన 'పింక్ డైమండ్' ఇష్యూను అనిత గారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గత ప్రభుత్వం హయాంలో లేని పింక్ డైమండ్ పేరుతో సభా సమయాన్ని వృథా చేశారని, కానీ అధికారుల విచారణలో అసలు అప్పట్లో అలాంటి డైమండే పోలేదని తేలిందని ఎద్దేవా చేశారు. "దేవుడంటే వైసీపీ నేతలకు భక్తి లేదని వారి చర్యలే చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి వారితో పెట్టుకోవద్దు, ఆ పాపం ఊరికే పోదు" అంటూ ఆమె తీవ్రంగా హెచ్చరించారు. వైసీపీ నేతలు స్వతంత్రంగా ఆలోచించరని, కేవలం 'సాక్షి' పేపర్లో వచ్చే వార్తలనే సభలో వల్లె వేస్తారని అనిత దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో సాక్షి పత్రికకు ప్రకటనల రూపంలో ఏకంగా రూ. 600 కోట్ల ప్రజాధనాన్ని ధారపోశారని ఆమె ఆరోపించారు. ప్రజల సొమ్మును ఒక పత్రిక ప్రయోజనం కోసం వాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి చిన్నారి హత్య కేసు గురించి కూడా హోం మంత్రి అప్‌డేట్ ఇచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ జైలులో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె ధృవీకరించారు. "తాను చేసిన తప్పుకు మనస్తాపం చెందే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని ఆమె వ్యాఖ్యానించారు.
తిరుమల లడ్డూ పవిత్రత అనేది కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ విషయంలో రాజకీయ విమర్శలు పక్కన పెట్టి, అసలు ఏం జరిగిందనే వాస్తవాలు సభ ద్వారా బయటకు రావాలని సామాన్య భక్తులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం విసిరిన సవాల్‌ను స్వీకరించి వైసీపీ చర్చకు వస్తుందో లేదో వేచి చూడాలి.