Fake Rolex: రూ. 500 కోట్ల ఆస్తి ఉన్నా చేతికి ఫేక్ రోలెక్స్ వాచ్... కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Fake Rolex: సమాజంలో హోదా, సంపద అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి ఖరీదైన కార్లు, బ్రాండెడ్ దుస్తులు, చేతికి మెరిసే లక్షల రూపాయల వాచ్‌లే.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన బిజినెస్‌మెన్ కథ...
లగ్జరీ బ్రాండ్లపై సంచలన చర్చ...
ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్న నకిలీ వాచ్ వెనక పెద్ద లాజిక్...
Fake Rolex: సమాజంలో హోదా, సంపద అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి ఖరీదైన కార్లు, బ్రాండెడ్ దుస్తులు, చేతికి మెరిసే లక్షల రూపాయల వాచ్‌లే. కానీ, రూ. 500 కోట్ల నికర ఆస్తి ఉన్న ఒక పారిశ్రామికవేత్త మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఆలోచించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారు. ఆయన చేతికి రూ. 25 లక్షలు విలువ చేసే అసలైన రోలెక్స్ డెటోనా (Rolex Daytona) వాచ్‌లాంటిది మెరుస్తుండటంతో, దాన్ని చూసిన ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రశంసించగా.. ఆయన ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్న రూ. 10 వేల దొంగ వాచ్: 'యు-ఎబిలిటీ' (UAbility) సంస్థ వ్యవస్థాపకుడు రోహన్ ధావన్ ఇటీవల ఈ ఆసక్తికరమైన సంఘటనను తన లింక్డిన్ (LinkedIn) ఖాతా ద్వారా పంచుకున్నారు. రోహన్ ధావన్ ఆ వ్యాపారవేత్తను కలిసినప్పుడు, ఆయన చేతికి మెరుస్తున్న వాచ్ చూసి "ఎంతోకాలంగా ఇలాంటి రోలెక్స్ వాచ్ కొనాలని నా కల" అని చెప్పారు. దానికి ఆ వ్యాపారవేత్త నవ్వుతూ.. "రోహన్, నేను నీకు ఒక నిజం చెప్తున్నా. ఇది అసలైన రోలెక్స్ కాదు, కేవలం ఒక ఫస్ట్ కాపీ (First Copy). ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక పేజీలో కేవలం రూ. 10,000 పెట్టి కొన్నాను" అని బదులిచ్చారు.
బిజినెస్‌మెన్ చెప్పిన షాకింగ్ లాజిక్: రూ. 500 కోట్ల ఆస్తి ఉండి కూడా అసలైన వాచ్ ఎందుకు కొనలేదని అడగగా, ఆ వ్యాపారవేత్త ఒక ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. "నేను ఉన్న హోదా, నాకున్న ఆస్తి చూసి నేను పెట్టుకున్న వాచ్ నకిలీది అని ఎవరూ అస్సలు ఊహించలేరు. ఇది సమయాన్ని సరిగ్గా చూపిస్తుంది, అందరి నుంచి కాంప్లిమెంట్స్ తెచ్చిపెడుతుంది, నా పని నెరవేరుస్తోంది. అలాంటప్పుడు కేవలం ఒక వాచ్ కోసం రూ. 25 లక్షలు దండగ చేయడం ఎందుకు?" అని స్పష్టం చేశారు.
నెట్టింట వేడెక్కిన చర్చ: ఈ సంఘటనను రోహన్ ధావన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్ల మధ్య తీవ్రమైన చర్చ ప్రారంభమైంది. వ్యక్తికి ఉన్న హోదానే ఆ వస్తువుకు విలువ తెస్తుందని, చేతికి ఉన్న వాచ్ కంటే దాన్ని ధరించిన వ్యక్తి క్రెడిబిలిటీయే ఇతరులను ప్రభావితం చేస్తుందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. బిల్ గేట్స్ కూడా సాధారణ కేసియో (Casio) వాచ్ ధరిస్తారని గుర్తుచేశారు. అయితే మరికొందరు మాత్రం, లగ్జరీ వస్తువులను ఇతరులకు చూపించుకోవడానికి కాకుండా, మన సొంత తృప్తి కోసం కొనాలని అభిప్రాయపడ్డారు.
Tags
Be the first to react