Salary Savings: జీతం రాగానే ఖర్చైపోతుందా? నెలాఖరులో డబ్బులు సేవ్ చేయడానికి బెస్ట్ టిప్స్!
Salary Savings: ప్రతినెలా వచ్చే జీతం నుంచి డబ్బులు పొదుపు చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ఉద్యోగుల కోసం ప్రముఖ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్ అక్షయ్ సిఎన్ (Akshay CN) 5 ప్రధాన తప్పులను నివారించాలని సూచించారు...
క్రెడిట్ కార్డ్ వాడకం నుండి సేవింగ్స్ వరకు... పొదుపు చేయడం ఎలా?
ఉద్యోగులు చేసే ఈ 5 తప్పులతోనే డబ్బులు ఖాళీ...
సాలరీ ప్లానింగ్ పై కీలక సూచనలు...
నెలాఖరు రాగానే చేతిలో రూపాయి కూడా మిగలకపోవడం, ఏం కొన్నామో తెలియకుండానే జీతం అయిపోవడం నేటి తరం ఉద్యోగులలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ప్రతినెల మంచి జీతం వస్తున్నప్పటికీ, పొదుపు చేయలేక చాలామంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్, ఫైనాన్స్ క్రియేటర్ అక్షయ్ సిఎన్ (Akshay CN) ఉద్యోగులు తమ జీతం పొదుపు విషయంలో చేసే 5 ప్రధాన తప్పుల గురించి వివరించారు. ఈ తప్పులను సరిదిద్దుకుంటే నెలాఖరులో కూడా మంచి నిధిని మిగుల్చుకోవచ్చని ఆయన సూచించారు.
1. అవసరానికి మించి క్రెడిట్ కార్డుల వాడకం
క్రెడిట్ కార్డులు సులభంగా డిస్కౌంట్లు, రివార్డులు ఇస్తున్నాయనే నెపంతో చాలామంది అవసరం లేకున్నా షాపింగ్ చేస్తుంటారు. జీతం రాకముందే క్రెడిట్ కార్డు బిల్లుల రూపంలో భవిష్యత్ ఆదాయాన్ని ఖర్చు చేయడం అతి పెద్ద తప్పు. కార్డు వాడకంపై నియంత్రణ లేకపోతే వడ్డీ చక్రబంధంలో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు.
2. స్మార్ట్ బడ్జెటింగ్ మరియు '50/30/20' రూల్ లేకపోవడం
ప్రతినెలా వచ్చే ఆదాయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడమే ఆర్థిక ఒత్తిడికి ప్రధాన కారణం. అక్షయ్ అభిప్రాయం ప్రకారం.. ప్రతి ఒక్కరూ 50/30/20 నియమాన్ని పాటించాలి.
50%: ఇంటి అద్దె, గ్రోసరీస్, విద్యుత్ బిల్లులు వంటి ప్రాథమిక అవసరాలకు (Needs),
30%: వినోదం, ప్రయాణాలు, కోరికలకు (Wants),
20%: తప్పనిసరిగా పొదుపు, పెట్టుబడులకు (Savings & Investments) కేటాయించాలి.
3. 'పొదుపు' తర్వాతే ఖర్చులు అనే సూత్రం మరవడం
చాలామంది జీతం రాగానే ముందుగా ఖర్చులు పూర్తి చేసి, చివరికి ఏమైనా మిగిలితే పొదుపు చేద్దామని అనుకుంటారు. కానీ ఇది తప్పుడు విధానం. జీతం క్రెడిట్ అయిన వెంటనే కనీసం 20 శాతం మొత్తాన్ని సిప్ (SIP) లేదా డిపాజిట్లలో సేవ్ చేసిన తర్వాతే మిగిలిన డబ్బుతో నెలవారీ ఖర్చులు ప్లాన్ చేసుకోవాలి.
4. ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోకపోవడం
హఠాత్తుగా వచ్చే వైద్య అత్యవసరాలు, ఉద్యోగంలో మార్పులు లేదా ఊహించని ఖర్చుల కోసం ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ఫండ్ (Emergency Fund) ఉంచుకోవాలి. కనీసం 3 నుండి 6 నెలల నెలవారీ ఖర్చులకు సరిపడా నిధిని లిక్విడ్ ఫండ్స్ లేదా సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచుకోకపోతే, అత్యవసర సమయాల్లో అప్పులు చేయాల్సి వస్తుంది.
5. జీతంతో పాటు ఖర్చులు పెంచుకోవడం (Lifestyle Creep)
ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి జీతం పెరిగినప్పుడు, చాలామంది పొదుపును పెంచడానికి బదులు తమ జీవనశైలి ఖర్చులను పెంచుకుంటారు. బ్రాండెడ్ వస్తువులు, ఖరీదైన గ్యాడ్జెట్లు కొనుగోలు చేయడం వల్ల ఎంత జీతం పెరిగినా పొదుపు మాత్రం సున్నాగానే మిగిలిపోతుందని అక్షయ్ హెచ్చరించారు.
Tags
Be the first to react