రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. 2026 జనవరి 1 నుంచి కొత్త బ్యాంకింగ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం, చాలా కాలంగా ఎలాంటి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాలను మూసివేయనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.
బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చడమే ఈ నిర్ణయానికి ప్రధాన లక్ష్యమని ఆర్బీఐ తెలిపింది. అలాగే, వినియోగంలో లేని ఖాతాల ద్వారా జరుగుతున్న డిజిటల్ మోసాలు, మనీలాండరింగ్ వంటి అక్రమాలను అరికట్టడం కూడా ఈ చర్యల ఉద్దేశమని స్పష్టం చేసింది. ఖాళీగా ఉన్న ఖాతాలను నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం అవసరమైందని పేర్కొంది.
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, మూడు రకాల బ్యాంకు ఖాతాలపై ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. వరుసగా రెండేళ్లపాటు లావాదేవీలు జరగని ‘డోర్మెంట్ ఖాతాలు’ శాశ్వతంగా మూసివేయే అవకాశం ఉంది. అలాగే, గత 12 నెలలుగా ఎలాంటి లావాదేవీలు లేని ‘ఇన్‌యాక్టివ్ ఖాతాలు’ తిరిగి యాక్టివేట్ చేయకపోతే బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
దీర్ఘకాలంగా సున్నా బ్యాలెన్స్‌తో ఉండి, కేవైసీ పూర్తి చేయని ఖాతాలు కూడా తొలగించవచ్చని బ్యాంకులు సూచిస్తున్నాయి. ఇలాంటి ఖాతాలు బ్యాంకులకు అనవసర పరిపాలనా భారం పెంచడమే కాకుండా, భద్రతా సమస్యలకు కారణమవుతాయని ఆర్బీఐ అభిప్రాయపడింది.
మీ బ్యాంకు ఖాతా మూతపడకుండా ఉండాలంటే కొన్ని సులభమైన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది. చిన్న మొత్తంలో డిపాజిట్ లేదా విత్‌డ్రాయల్ చేయడం, యూపీఐ లేదా ఇతర డిజిటల్ లావాదేవీలు నిర్వహించడం, లేదా ఏటీఎం ద్వారా ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఖాతా యాక్టివ్ అవుతుంది. అలాగే, సమీప బ్యాంకు శాఖను సందర్శించి కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం అని స్పష్టం చేసింది.