ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాస్టర్లకు క్రిస్మస్ సందర్భంగా శుభవార్త చెప్పింది. పాస్టర్లకు గౌరవ వేతనం కింద మొత్తం రూ.50.50 కోట్లను విడుదల చేసింది. సెమీ క్రిస్మస్ వేడుకల సమయంలో పెండింగ్ బకాయిలను క్రిస్మస్ నాటికి విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేస్తూ, క్రిస్మస్‌కు ఒకరోజు ముందుగానే పాస్టర్ల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేశారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 8,418 మంది పాస్టర్లకు లబ్ధి చేకూరనుంది. ఒక్కో పాస్టర్‌కు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం అందించనుండగా, సంవత్సరానికి మొత్తం రూ.60 వేల వేతనం చెల్లించనున్నారు. ఈ మేరకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసి, పాస్టర్లకు ఆర్థిక భరోసా కల్పించింది.
డిసెంబర్ 22న విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు ఈ హామీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో క్రైస్తవుల గౌరవం, భద్రతకు ఎలాంటి భంగం కలగనివ్వమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని, అందరి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు.
క్రైస్తవ సంస్థలు రాష్ట్రంలో విద్యా రంగంలో చేసిన సేవలను చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా క్రైస్తవ విద్యాసంస్థలు లక్షలాది మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. అలాగే, 2014–2019 మధ్యకాలంలో చర్చిల నిర్మాణానికి రూ.77 కోట్లు మంజూరు చేసినట్లు, ఇప్పటికే 377 చర్చిల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన వాటికీ త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తరపున తొలిసారిగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్రబాబు గుర్తు చేశారు. పాస్టర్లకు గౌరవ వేతనం ప్రారంభించిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పాస్టర్లకు పెండింగ్ బకాయిలను క్రిస్మస్‌కు ముందే విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం తన నిబద్ధతను చాటిందని క్రైస్తవ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.