దిత్వా తుఫాను ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే సముద్రంలో తుఫాను తీవ్రరూపం దాల్చి, తీరం వైపు వేగంగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. ప్రత్యేకించి తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో వర్షాలు మరింత తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ముందుజాగ్రత్త చర్యగా రేపు (శనివారం) జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు మరియు అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు. పిల్లల భద్రత, ప్రయాణ సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. వర్షాల తీవ్రత రాత్రికి రాత్రే పెరిగే అవకాశం ఉండడంతో రేపు ఉదయం ప్రయాణంకూడా ప్రమాదకరంగా ఉండొచ్చని సూచించారు.
ఇదే సమయంలో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా తుఫాను ముప్పు పెరుగుతుండడంతో అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత కోసం ప్రభుత్వాన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో, పలు స్థానిక సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా దీనిపై డిమాండ్ చేస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యలుగా నదులు, కాలువల దగ్గరకి వెళ్లవద్దని, అవసరమైతే తప్ప బయట తిరగవద్దని, ఇంటి దగ్గర నీరు చేరినట్లయితే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం రేపు తిరుపతి జిల్లాలో గంటకు 60–80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పారు. తుఫాన్ తీరం చేరే సమయంలో భారీ వర్షాలతో పాటు వరదలు, మట్టిచరియలు సంభవించే అవకాశముందని హెచ్చరించారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, చెట్లు పడిపోయే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తంగా ఉంచి, NDRF బృందాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో విభాగాల కంట్రోల్ రూమ్ నంబర్లకు సంప్రదించవచ్చని సూచించారు. ఇంకా ఏ ఏ జిల్లాలకు సెలవులు ప్రకటిస్తారో, తుఫాన్ ఎప్పుడు తీరం దాటుతుందో తదుపరి అప్డేట్స్ కోసం వేచి చూడాలి.