గుజరాత్ రాష్ట్రంలోని (Gujarat State ) ప్రముఖ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని (Somnath temple) ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇవాళ సందర్శించడంతో దేశవ్యాప్తంగా భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. వెయ్యేళ్ల క్రితం ఈ మహాదేవాలయంపై జరిగిన తొలి దాడిని గుర్తు చేసుకుంటూ, ఆలయ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకునే శౌర్య యాత్రలో ప్రధాని పాల్గొన్నారు. భారతీయ నాగరికత, సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకోవడం తనకు గర్వకారణమని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.
ఆలయ పరిసరాల్లో నిర్వహించిన రోడ్ షోలో ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ‘మన నాగరిక ధైర్యానికి చిహ్నమైన సోమనాథ్‌కు రావడం నాకు గర్వంగా ఉంది’ అని ప్రధాని ట్వీట్ చేస్తూ తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. ఓంకార మంత్రధ్వనులతో ఆలయ ప్రాంగణం మార్మోగగా, వందలాది భక్తులతో కలిసి మోదీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక శక్తి, శాంతి, విశ్వాసం సమ్మేళనంగా కనిపించిన ఈ ఘట్టం ఎంతో విశేషంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘స్వచ్ఛమైన భక్తి క్షణం..
శ్వాసలో విశ్వాసం.. నిశ్శబ్దంలో క్రమశిక్షణ.. దైవానికి దాసోహం అవ్వండి’ అంటూ భావపూరిత సందేశం రాశారు. వెయ్యేళ్ల క్రితం ఆలయంపై జరిగిన దాడిని గుర్తు చేసుకుంటూ, ఆ కాలంలో ఆలయ గౌరవాన్ని కాపాడేందుకు పోరాడిన వీరుల త్యాగాలను ప్రధాని ఘనంగా నివాళులర్పించారు. నేటి సోమనాథ్ ఆలయం భారతీయ ఆత్మవిశ్వాసానికి, పునర్నిర్మాణ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు.
గతంలో ఎన్నో దాడులను ఎదుర్కొన్నప్పటికీ తిరిగి పునర్నిర్మించబడి విశ్వాసానికి అజేయ శక్తిగా నిలిచిన ఈ ఆలయం, భారత సంస్కృతి ఎన్నటికీ చెదరని సత్యాన్ని ప్రపంచానికి చాటుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని పర్యటనతో సోమనాథ్ క్షేత్రం మరింత పవిత్రతను సంతరించుకుని, భక్తుల హృదయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ యాత్ర భారతీయ చరిత్ర, ఆధ్యాత్మికత, వీరత్వ సంప్రదాయాల గొప్పతనాన్ని మరోసారి దేశానికి గుర్తు చేసిన ఘట్టంగా నిలిచింది.