ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణం అంటేనే ఒకప్పుడు వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి. కానీ, ఇప్పుడు ఆ దృశ్యం మారుతోంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు.
శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన రహదారుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి పనులపై కీలక ప్రకటనలు చేశారు. వాటి వివరాలు ఇక్కడ చూద్దాం. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చు చేస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 3,380 కోట్లతో రోడ్ల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రూ. 1,081 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా 16,000 కిలోమీటర్ల మేర రోడ్లను బాగు చేశారు. గుంతలు పూడ్చివేసే ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి గ్రామీణ మరియు ప్రధాన రహదారుల పనులన్నీ పూర్తి చేసి, ప్రజలకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లెలో బొండాడ డ్రెయిన్ పై శిథిలావస్థకు చేరిన పాత బ్రిడ్జి స్థానంలో కొత్తగా రూ. 12 కోట్లతో 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. అంతకుముందు పాత బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి, దాని దుస్థితిని చూసి విస్మయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇలాంటి కీలకమైన నిర్మాణాలను పట్టించుకోకపోవడం వల్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.
రోడ్ల పునరుద్ధరణలో కృష్ణా జిల్లాకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. జిల్లావ్యాప్తంగా రూ. 160 కోట్లతో 1,518 కిలోమీటర్ల రోడ్లను బాగు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి:
- మచిలీపట్నం: రూ. 33 కోట్లు (166 కి.మీ)
- పామర్రు: రూ. 28 కోట్లు
- గన్నవరం: రూ. 27 కోట్లు
- పెడన: రూ. 26 కోట్లు
- అవనిగడ్డ: రూ. 20 కోట్లు
- గుడివాడ: రూ. 16 కోట్లు
మచిలీపట్నం పోర్టు: 2026 డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందా.?
మచిలీపట్నం వాసుల చిరకాల స్వప్నమైన పోర్టు నిర్మాణంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు పోర్టు పనులు 50 శాతం పైగా పూర్తయ్యాయి. దీనికోసం రూ. 1,760 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 42 శాతం పనులను సుమారు రూ. 1,700 కోట్లతో పూర్తి చేసి, 2026 డిసెంబర్ నాటికి పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రహదారుల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి వెన్నుదన్నుగా నిలుస్తోందని తెలిపారు. వేల కోట్ల రూపాయల నిధులతో నేషనల్ హైవేలతో పాటు స్టేట్ హైవేలను కూడా అనుసంధానిస్తున్నామని చెప్పారు. కేవలం రోడ్లే కాకుండా, పరిశ్రమలను ఆకర్షించాలంటే మౌలిక సదుపాయాలు బాగుండాలని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.