సోషల్ మీడియాలో రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తూనే ఉంది. అలాంటివాటిలో తాజాగా వైరలవుతున్న ట్రెండ్ “365 (Buttons) ఛాలెంజ్”. దీని వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్‌గా కనిపించినా, దాని అర్థం మాత్రం లోతుగా తాకుతోంది. తమారా అనే సోషల్ మీడియా యూజర్ 2025 చివర్లో ఒక పోస్ట్ చేసింది. ఆమె 365 చిన్న బటన్లు కొనుక్కొని, ప్రతి రోజూ ఒక బటన్‌ను వేరే డబ్బాలో పక్కన పెడతానని చెప్పింది. ఈ బటన్లు తన రోజువారీ సమయాన్ని, తన బాధ్యతను, తాను జీవిస్తున్న ప్రతి రోజుని గుర్తు చేస్తాయని ఆమె వివరించింది. అంటే ఒక రోజు గడిచింది అన్న గుర్తుగా ఒక బటన్‌ను వేరు చేయడం. ఏడాది చివరికి 365 బటన్లు ఒక డబ్బాలో చేరితే, అది “నేను ఒక ఏడాది ఎలా గడిపాను?” అనే ప్రశ్నకు కనిపించే సమాధానం అన్నమాట.
ఈ ఆలోచన మొదట వింతగా అనిపించినా, నెటిజన్లు ఆసక్తిగా స్పందించారు. బటన్లే ఎందుకు?, ఇలా చేస్తే ఉపయోగం ఏమిటి?, ఇది కేవలం షో ఆఫ్ కాదా? అంటూ చాలామంది ప్రశ్నలు సంధించారు. అయితే వాటికి తమారా ఇచ్చిన సమాధానమే ఈ ట్రెండ్‌ను మరింత వైరల్ చేసింది. ఆమె “నాకర్థమైతే చాలు. నా జీవితానికి అర్థం నేనే నిర్ణయించుకుంటాను. ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు” అని చెప్పింది. ఈ ఒక్క వాక్యమే ఈ ట్రెండ్‌కు అసలు స్పిరిట్‌గా మారింది. అంటే, మన నిర్ణయాలకు ఇతరుల అంగీకారం అవసరం లేదు, మనకు నచ్చితే అదే సరైన దారి అన్న భావనకు ప్రతీకగా 365 బటన్స్ ట్రెండ్ నిలిచింది.
ఇప్పుడు చాలామంది యువత దీన్ని కేవలం ట్రెండ్‌గా కాకుండా ఒక మోటివేషనల్ సింబల్గా తీసుకుంటున్నారు. రోజూ ఒక బటన్ పక్కన పెట్టడం ద్వారా ఈ రోజు నేను నా సమయాన్ని ఎలా ఉపయోగించాను?, నా లక్ష్యాల వైపు ఒక్క అడుగు వేశానా? అనే ఆత్మపరిశీలన పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు దీనిని టైమ్ మేనేజ్‌మెంట్‌కు, మరికొందరు మెంటల్ డిసిప్లిన్‌కు ఉపయోగిస్తున్నారు. ఇంకొందరు అయితే ఇది చిన్న చిన్న అలవాట్లను క్రమంగా నిర్మించడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.
మొత్తానికి (365 Buttons) ట్రెండ్ ఒక సాధారణ బటన్ల ఆట కాదు. ఇది స్వీయ నిర్ణయం, స్వీయ బాధ్యత, ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకుండా జీవించాలి అనే భావనకు ఒక ప్రతీక. ఈ తరం యువత “నా జీవితం నా నియమాలు” అన్న సందేశాన్ని బలంగా చాటేందుకు ఈ ట్రెండ్ ఒక డిజిటల్ మానిఫెస్టోలా మారింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో 365 బటన్లు కేవలం వస్తువులు కాదు… అవి ఒక ఆలోచనకు గుర్తులుగా నిలిచాయి.