లవంగాన్ని నానబెట్టిన లేదా మరిగించిన నీరు చర్మ ఆరోగ్యానికి సహజమైన శక్తివంతమైన హోమ్ రమెడీగా పరిగణించబడుతుంది. ఇందులో ఉన్న యూజెనాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని రక్షిస్తుంది. డెడ్ స్కిన్, నల్ల మచ్చలు, ముడుతలు రాకుండా సహాయపడుతుంది. రోజూ పరిమితంగా తీసుకుంటే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి చర్మం కాంతివంతంగా కనిపించేందుకు దోహదం చేస్తుంది.
ఈ లవంగం నీటిలో యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల మొటిమల సమస్య ఉన్నవారికి మంచి ఫలితాలు ఇవ్వగలదు. ఇది చర్మంపై బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది. మంట, ఎర్రదనం వంటి సమస్యలను సద్దుమణిగిస్తుంది. దీన్ని క్రమంగా ఉపయోగిస్తే బ్రేకౌట్లు తగ్గి, చర్మం మరింత పరిశుభ్రంగా కనిపిస్తుంది.
జీర్ణవ్యవస్థ బాగుండటం కూడా చర్మ ఆరోగ్యానికి కీలకం. లవంగం నీరు జీర్ణక్రియను మెరుగుపరచి కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. శరీరం వ్యర్థాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయడం వల్ల దద్దుర్లు తగ్గి, చర్మం తాజాగా, సమతుల్యంగా కనిపించడానికి ఇది దోహదపడుతుంది.
లవంగం నీరు శరీర జీవక్రియను కూడా సమతుల్యం చేయగలదు. అధిక కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రించడం, హార్మోన్ల మార్పులను సమతుల్యం చేయడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఆయిలీ, డ్రై స్కిన్ ఉన్నవారికి ఇది సహజంగా ఉపశమనం ఇస్తుంది. పిగ్మెంటేషన్, నల్ల మచ్చలను తగ్గించి చర్మానికి సహజమైన ప్రకాశాన్ని అందిస్తుంది. క్రమం తప్పకుండా పరిమితంగా తీసుకుంటే చర్మం మరింత నిగారింపు పొందుతుంది.
అయితే, లవంగం నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. అధికంగా తీసుకుంటే ఎసిడిటీ, నోటిలో పుండ్లు, అలర్జీ, కాలేయ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎసిడిటీ, అల్సర్లు, కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు డాక్టర్ సలహా లేకుండా ఈ నీటిని తీసుకోకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజుకు ఒక గ్లాసు (150–200 ml) తేలికపాటి లవంగం నీరు ఉదయం తీసుకోవడం ఉత్తమం.