ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. జనవరి 1, 2026 నుంచి బియ్యంతో పాటు రాగులు, గోధుమ పిండి కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ కొత్త సరుకుల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. బియ్యం బస్తాలపై కూడా క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా రాగుల పంపిణీ జరుగుతుందని, మూడు కేజీల చొప్పున రాగులు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇదివరకు కిలో గోధుమ పిండి ధర రూ.18గా ఉన్నట్లు, ఈసారి కూడా అదే ధర ఉండే అవకాశం ఉందని తెలిపారు. క్యూఆర్ కోడ్ విధానం అమలులోకి వస్తే బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని, సరుకులు అర్హులైన ప్రతి కుటుంబానికి సమయానికి అందుతాయని మంత్రి వివరించారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, నిల్వ సామర్థ్యం పెంపుపై కూడా కేంద్రంతో చర్చలు ముగిసినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఈ ఏడాది 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతించినట్లు చెప్పారు. ఇప్పటికే 17.30 లక్షల టన్నులు కొనుగోలు చేసి, 2.60 లక్షల మంది రైతులకు రూ.4,120 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. 2,550 కొనుగోలు కేంద్రాలు, 16 వేల సిబ్బంది, 32 వేల వాహనాలతో కొనుగోలు ప్రక్రియ సాగుతున్నట్లు తెలిపారు.
ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి పీపీపీ పద్ధతిలో స్టీల్ సైలోస్ నిర్మించాలని కేంద్రం అంగీకరించిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా వరి ఎక్కువగా పండే గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొత్త సైలోస్ నిర్మించనున్నట్లు చెప్పారు. దీనివల్ల ధాన్యం నిల్వలో నాణ్యత పెరుగుతుందని, నష్టాలు తగ్గుతాయని అన్నారు. రేషన్ బియ్యం నిల్వ కోసం కూడా ఎఫ్‌సీఐ అదనపు గోదాంల నిర్మాణానికి అనుమతినిచ్చినట్లు తెలిపారు.
రాష్ట్ర పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేసే బియ్యంపై ఇప్పటికే క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాకింగ్ చేస్తున్నట్లు మంత్రి గుర్తుచేశారు. ఇదే విధానాన్ని ఇప్పుడు రేషన్ బియ్యం పంపిణీలో అమలు చేస్తారని చెప్పారు. అక్రమ రవాణాను అరికట్టడానికి, పారదర్శకత పెంచడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు. జనవరి 2026 నుంచి కొత్త విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుండడంతో లబ్ధిదారులకు మరింత సౌకర్యం కలుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.