తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే రాష్ట్రంలో పెట్టుబడుల వర్షం కురిసింది. మొత్తం 1.88 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు తెలంగాణ ప్రభుత్వం వివిధ కంపెనీలతో కుదుర్చుకుంది. ముఖ్యంగా డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో భారీగా ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రాన్ని గ్రీన్ ఫ్యూయల్స్‌లో అగ్రస్థానంలో నిలపడానికి అథిరత్ హోల్డింగ్స్ రూ.4,000 కోట్లతో 25 CBG ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.
ముఖేష్ అంబానీ సంస్థ వంతారాతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రత్యేకంగా నిలిచింది. హైదరాబాదులో ప్రపంచ స్థాయి వన్యప్రాణి కన్జర్వేటరీ, నైట్ సఫారీ నిర్మాణానికి రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. వంతారా ఇప్పటికే జంతు సంరక్షణ, పునరావాసం, శాస్త్రీయ నిర్వహణలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలు సాధించినందున, ఆ నైపుణ్యాన్ని తెలంగాణ ప్రాజెక్టుకు అన్వయించనున్నారు.
క్రీడా రంగంలో కూడా భారీ పెట్టుబడులు ప్రకటించబడ్డాయి. సూపర్ క్రాస్ ఇండియా, భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి మోటోక్రాస్, రేసింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో ఆధునిక డర్ట్ ట్రాక్స్, రైడర్ ట్రైనింగ్ జోన్‌లు, ప్రేక్షకుల సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం భూమి, అనుమతులు, మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం సహకారం అందించనుంది.
సినీ, వినోద రంగంలో సల్మాన్ ఖాన్ వెంచర్స్ రూ.10,000 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. హైదరాబాద్‌లో అత్యాధునిక టౌన్‌షిప్, ఫిల్మ్ స్టూడియో, గోల్ఫ్ కోర్స్, రేసింగ్ సదుపాయాలు, నేచర్ ట్రైల్స్, ప్రీమియం నివాసాలను ఏర్పాటు చేయనుంది. ఈ పెట్టుబడి తెలంగాణ సృజనాత్మక రంగానికి ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఆరోగ్య మరియు విద్య రంగాల్లో కూడా కీలక ఒప్పందాలు కుదిరాయి. అపోలో గ్రూప్ 400 పడకల కొత్త ఆసుపత్రితో పాటు డిజిటల్ హెల్త్, జెనోమిక్స్, టెలీ మెడిసిన్ రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. అదనంగా రూ.800 కోట్లతో డీమ్డ్-టు-బీ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నది. లండన్ విశ్వవిద్యాలయం, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌తో కుదిరిన ఒప్పందాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా TMTG నుండి వచ్చే 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి డిజిటల్ ఇన్‌ఫ్రా, AI ఆధారిత పాలన, మీడియా టెక్ అభివృద్ధికి దోహదం చేయనుంది.