షుగర్ సమస్యతో బాధపడేవారికి ఇది నిజంగా శుభవార్తే. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించాలంటే కఠినమైన డైట్లు పాటించాలి, గంటల తరబడి వ్యాయామం చేయాలి అనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ AIIMSలో శిక్షణ పొందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సౌరభ్ సేథి ప్రకారం, చిన్న అలవాటు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. భోజనం చేసిన వెంటనే కేవలం 10 నిమిషాలు నడిస్తే చాలు, అది మందులకన్నా మెరుగ్గా పని చేస్తుందని ఆయన వెల్లడించారు. మనం భోజనం చేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సహజంగానే పెరుగుతాయి. ఈ సమయంలో మనం కదలకుండా కూర్చుంటే లేదా పడుకుంటే, ఆ గ్లూకోజ్ శరీరంలో ఎక్కువసేపు నిలిచి షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంటుంది.
కానీ తిన్న వెంటనే మెల్లగా నడవడం మొదలుపెడితే, మన కండరాలు రక్తంలోని గ్లూకోజ్‌ను ఇంధనంగా ఉపయోగించుకుంటాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ సడన్‌గా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు, ఈ చిన్న నడక ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది. అంటే మన శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతుంది. దీని ఫలితంగా టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మరో ముఖ్యమైన లాభం ఏమిటంటే, కాలేయంలో కొవ్వు చేరే అవకాశం తగ్గి ఫ్యాటీ లివర్ సమస్యను కూడా నివారించవచ్చు. ఈ అలవాటు కోసం ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు, ఖరీదైన పరికరాలు కూడా అవసరం కాదు.
ఇంట్లోనే, ఆఫీస్‌లోనే, భోజనం చేసిన తర్వాత చిన్నపాటి వాకింగ్ చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత నడక చాలా ప్రయోజనకరమని వైద్యులు సూచిస్తున్నారు. వయస్సు ఎంతైనా, ఆరోగ్య స్థితి ఎలా ఉన్నా, మెల్లగా నడవడం అందరికీ సురక్షితమైన వ్యాయామమే. రోజూ ఇదే అలవాటు కొనసాగిస్తే, కొద్ది రోజులకే శరీరంలో తేలికపాటు, జీర్ణక్రియ మెరుగుదల, షుగర్ లెవల్స్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తాయి. మందులపై ఆధారపడకుండా సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, తిన్న తర్వాత 10 నిమిషాల నడకను తప్పనిసరి అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న అడుగే… కానీ ఆరోగ్యానికి పెద్ద రక్షణ.