ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం రూపురేఖలు త్వరలోనే పూర్తిగా మారనున్నాయి. ముంబై తరహాలో విశాఖను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోంది. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన నేషనల్ గ్రోత్ హబ్ కార్యక్రమంలో భాగంగా, విశాఖను గ్లోబల్ ఎకనామిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
ఈ ప్రణాళికల అమలులో భాగంగా, ఏపీ ప్రభుత్వ అధికారుల బృందం ఇటీవల ముంబైకి వెళ్లి అక్కడి పట్టణాభివృద్ధి నమూనాలను అధ్యయనం చేసింది. సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర (CIDCO), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) అమలు చేస్తున్న విధానాలు, నిధుల సమీకరణ పద్ధతులను పరిశీలించారు. ముఖ్యంగా భూసంపద ఆధారంగా స్వయం సమృద్ధిగా ఎలా అభివృద్ధి సాధించవచ్చో అధ్యయనం చేశారు.
నీతి ఆయోగ్ సూచనల మేరకు, కైలాసగిరి నుంచి భీమిలి మధ్య బే సిటీ అభివృద్ధి చేయాలని, విశాఖపట్నం 2.0ను భోగాపురం విమానాశ్రయం వరకు విస్తరించాలని ప్రతిపాదించారు. అలాగే గ్రీన్‌ఫీల్డ్ భోగాపురం విమానాశ్రయం చుట్టూ ఏరోసిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలన్న ఆలోచనకు రూపకల్పన జరుగుతోంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ల్యాండ్ మానిటైజేషన్, FSI ప్రీమియంల ద్వారా సమకూర్చుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
ముంబైలోని నవీ ముంబై, NAINA (నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ నోటిఫైడ్ ఏరియా) వంటి అభివృద్ధి నమూనాలను బెంచ్‌మార్క్‌లుగా తీసుకొని, వైజాగ్ 2.0, భోగాపురం ఏరోసిటీ ప్రాజెక్టులను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం CIDCO సుమారు రూ.14,000 కోట్ల వార్షిక బడ్జెట్‌తో భూమి, రియల్ ఎస్టేట్ ఆదాయాల ద్వారా స్వయం సమృద్ధిగా పనిచేస్తున్న తీరు అధికారులకు ప్రేరణగా నిలిచింది.
ఇందులో భాగంగా దక్షిణాన విశాఖపట్నం పోర్ట్ నుంచి ఉత్తరాన భోగాపురం విమానాశ్రయం వరకు 200–250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ కోస్టల్ హబ్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. కైలాసగిరి–భీమిలి మధ్య 25 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని వాటర్‌ఫ్రంట్ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఉన్నాయి. అలాగే మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురంలోని ఐటీ, డేటా సెంటర్ హబ్‌లు, వైజాగ్ బే సిటీ వంటి ప్రాజెక్టుల ద్వారా విశాఖ భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయి నగరంగా మారనుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.