Earthquake: భూకంపం రాకముందే ఫోన్ హెచ్చరిక.. ప్రాణాలను కాపాడిన టెక్నాలజీ!
Earthquake: ప్రకృతి విపత్తులు ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయో ఖచ్చితంగా చెప్పడం ఇప్పటికీ సాధ్యం కాదు. కానీ విపత్తు మొదలైన వెంటనే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే సాంకేతికత మాత్రం ప్రాణాలను కాపాడగలదని వెనిజులాలో జరిగిన ఘటన మరోసారి నిరూపించింది.
వెనిజులాలో సెకన్ల ముందే అలర్ట్.. గూగుల్ భూకంప హెచ్చరిక వ్యవస్థకు ప్రశంసలు..
భూకంపాన్ని అంచనా కాదు.. ప్రారంభ సంకేతాలను గుర్తించిన స్మార్ట్ టెక్నాలజీ..
ప్రకృతి విపత్తులు ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయో ఖచ్చితంగా చెప్పడం ఇప్పటికీ సాధ్యం కాదు. కానీ విపత్తు మొదలైన వెంటనే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే సాంకేతికత మాత్రం ప్రాణాలను కాపాడగలదని వెనిజులాలో జరిగిన ఘటన మరోసారి నిరూపించింది.
వెనిజులాలో భారీ భూకంపం సంభవించే కొద్ది క్షణాల ముందు లక్షలాది మంది ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు హెచ్చరిక సందేశాలు అందాయి. భూమి కంపించడం ప్రారంభమైన తర్వాత వచ్చిన ఈ అలర్ట్, బలమైన ప్రకంపనలు చేరుకునే ముందే ప్రజలను అప్రమత్తం చేసింది.
ఈ ఘటనతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో టెక్నాలజీ పాత్రపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే గూగుల్ భూకంపాన్ని ముందుగా అంచనా వేయలేదని నిపుణులు స్పష్టం చేశారు. భూకంపం ప్రారంభ సంకేతాలను గుర్తించి, ప్రమాదకర ప్రకంపనలు వచ్చేలోపు సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు హెచ్చరికలు పంపిందని తెలిపారు.
గూగుల్ రూపొందించిన ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్స్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది ఆండ్రాయిడ్ ఫోన్లలోని మోషన్ సెన్సర్లను ఉపయోగిస్తుంది. ఫోన్లలో ఉండే యాక్సిలరోమీటర్లు భూమిలో మొదట వచ్చే సూక్ష్మ కదలికలను గుర్తిస్తాయి.
భూకంపంలో ముందుగా వచ్చే పీ-వేవ్స్ (Primary Waves) వేగంగా ప్రయాణిస్తాయి. వీటిని గుర్తించిన ఫోన్ల నుంచి వచ్చిన సమాచారాన్ని గూగుల్ అల్గారిథమ్స్ విశ్లేషించి భూకంపం ఉన్న ప్రాంతం, తీవ్రతను అంచనా వేస్తాయి. తర్వాత ఆ ప్రాంతానికి సమీపంలోని ఫోన్ వినియోగదారులకు తక్షణ హెచ్చరికలు పంపుతాయి.
భూకంప హెచ్చరికకు లభించే సమయం కేవలం కొన్ని సెకన్లు మాత్రమే కావచ్చు. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఆ కొద్దిసేపు కూడా ఎంతో కీలకంగా మారుతుంది. ఆ సమయంలో ప్రజలు భవనాల నుంచి బయటకు రావడం, ప్రమాదకర పనులు నిలిపివేయడం, సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
హెచ్ఆర్ అనెక్సీకి చెందిన బీటీఎస్.ఏఐ డైరెక్టర్ నిఖర్ అరోరా మాట్లాడుతూ, వెనిజులా ఘటన టెక్నాలజీ ఆధారిత భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థల అభివృద్ధికి ఉదాహరణగా నిలిచిందన్నారు. భూకంపాన్ని ముందుగా ఊహించడం కాదని, ప్రారంభ సంకేతాలను గుర్తించి వేగంగా సమాచారం అందించడమే ఈ వ్యవస్థ ప్రత్యేకత అని తెలిపారు.
ఎన్విరోకేర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు హృషిత్ పంత్రీ మాట్లాడుతూ, ఇలాంటి సాంకేతికతలు విపత్తుల సమయంలో సమాజ రక్షణను పెంచుతాయని అన్నారు. భూకంపాలను ఆపడం సాధ్యం కాకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించేలా ముందస్తు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు.
భవిష్యత్తులో భూకంపాలతో పాటు వరదలు, తుఫాన్లు, తీవ్ర వేడి వంటి అనేక ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ఇలాంటి హెచ్చరిక వ్యవస్థలు కీలకంగా మారనున్నాయని తెలిపారు.
ప్రస్తుతం విపత్తు నిర్వహణలో సంప్రదాయ పర్యవేక్షణ కేంద్రాలతో పాటు స్మార్ట్ఫోన్లు, క్లౌడ్ కంప్యూటింగ్, రియల్ టైమ్ డేటా వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించే పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, టెక్నాలజీ సంస్థలు కలిసి పనిచేస్తే ప్రజలకు వేగంగా హెచ్చరికలు చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు. వెనిజులాలో ఫోన్లు ఇచ్చిన హెచ్చరిక సమయం చాలా తక్కువైనా, చాలామంది ప్రజలకు ఆ కొద్ది సెకన్లు ప్రమాదం నుంచి బయటపడేందుకు కీలకంగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
1 readers have reacted