రాష్ట్ర ప్రజలకు వాతావరణం మార్పు ద్వారా ఉపశమనం అందే సమయం దగ్గరలోనే ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు ప్రారంభం నుంచి వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు త్వరలో ముగియనున్నాయి. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడగా, ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో, శనివారం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ఉత్సాహం పెరిగే అవకాశం ఉందని అంచనా. రాబోయే రెండు వారాల వ్యవధిలో ఎక్కువ రోజులు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఆగస్టు 13 నాటికి అల్పపీడనం…
రుతుపవనాల ప్రభావంతో మేఘావృతం పెరగడం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వలన, ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని నిపుణులు చెప్పారు. ఇది పశ్చిమ దిశగా కదిలి, తర్వాత మరిన్ని అల్పపీడనాలు ఏర్పడి తుపాన్లుగా బలపడే అవకాశముందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి.
ఏకధాటిగా వర్షాలు మాత్రం తక్కువ…
రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షాలు పడకపోవడం వర్షాభావ పరిస్థితులకు దారితీసింది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 288.8 మిల్లీమీటర్లుగా ఉండాల్సి ఉండగా, కేవలం 215.6 మిల్లీమీటర్లే నమోదైంది.
“ఈ నెలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. అయితే, గతంలోలా నిరంతర వర్షాలు కురిసే పరిస్థితులు తక్కువ. సెప్టెంబరు నాటికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది” అని ఐఎండీ మాజీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ తెలిపారు.
వింజమూరులో అత్యధిక వర్షపాతం…
వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం, శుక్ర, శని, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. గురువారం నెల్లూరు, కోనసీమ, కాకినాడ, వైఎస్సార్ కడప, అనకాపల్లి, ప్రకాశం, అనంతపురం, ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అందులో అత్యధికంగా నెల్లూరు జిల్లా వింజమూరులో 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.