మన లివింగ్ రూమ్ లో ఇంటిల్లపాదిని అలరించే టీవీ చరిత్ర ఒక వింత!
World Television Day: ఒకప్పుడు టీవీ చూడాలంటే ఊరంతా ఒకచోట చేరాల్సిందే. ఆదివారం ఉదయం రామాయణం, మహాభారతం సీరియళ్ల కోసం వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయేవి. బుధ, శుక్రవారాల్లో ప్రసారమయ్యే చిత్రలహరి పాటల కోసం యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేది. అలాంటి టెలివిజన్ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో మార్పులు చెంది మన అరచేతిలోని స్మార్ట్ స్క్రీన్ వరకు చేరింది. ఈ నేపథ్యంలో నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
- భారత్‌లో టెలివిజన్ ప్రసారాలు 1959 సెప్టెంబర్ 15న ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభమయ్యాయి.
- 1996లో ఐక్యరాజ్యసమితి నవంబర్ 21ను ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా ప్రకటించింది.
World Television Day: ఒకప్పుడు టీవీ చూడాలంటే ఊరంతా ఒకచోట చేరాల్సిందే. ఆదివారం ఉదయం రామాయణం, మహాభారతం సీరియళ్ల కోసం వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయేవి. బుధ, శుక్రవారాల్లో ప్రసారమయ్యే చిత్రలహరి పాటల కోసం యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేది. అలాంటి టెలివిజన్ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో మార్పులు చెంది మన అరచేతిలోని స్మార్ట్ స్క్రీన్ వరకు చేరింది. ఈ నేపథ్యంలో నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
టెలివిజన్ ఆవిష్కరణ ఎలా జరిగింది?
టెలివిజన్ అభివృద్ధి వెనుక ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి ఉంది. 1926 జనవరి 24న స్కాట్లాండ్‌కు చెందిన జాన్ లోగీ బేర్డ్ తొలిసారిగా కదిలే చిత్రాలను ప్రసారం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అనంతరం 1927లో అమెరికా శాస్త్రవేత్త ఫిలో ఫార్న్స్‌వర్త్ ఎలక్ట్రానిక్ టెలివిజన్ వ్యవస్థను రూపొందించారు. 1936లో బ్రిటన్‌కు చెందిన బీబీసీ క్రమబద్ధమైన హై డెఫినిషన్ ప్రసారాలను ప్రారంభించింది.
1959లో భారత్‌లో టీవీ ప్రసారాలకు శ్రీకారం
భారత్‌లో టెలివిజన్ ప్రయాణం 1959 సెప్టెంబర్ 15న ఢిల్లీలో ప్రయోగాత్మక ప్రసారాలతో మొదలైంది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ ప్రసారాలను ప్రారంభించారు. యునెస్కో సహకారంతో ఫిలిప్స్ సంస్థ అందించిన పరికరాల ద్వారా ఆల్ ఇండియా రేడియో (AIR) ఆధ్వర్యంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రారంభంలో ఢిల్లీ పరిసర ప్రాంతాలకే ప్రసారాలు పరిమితమయ్యాయి. వారంలో రెండు రోజులు, రోజుకు సుమారు గంటపాటు కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. 1965లో రోజువారీ వార్తా ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1976 ఏప్రిల్ 1న దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో నుంచి విడిపోయి ప్రత్యేక విభాగంగా ఏర్పడింది.
కలర్ టీవీతో మారిన వినోద ప్రపంచం
1982 భారత టెలివిజన్ చరిత్రలో కీలకమైన సంవత్సరం. ఆగస్టు 15న జాతీయ ప్రసారాలు ప్రారంభం కావడంతో పాటు కలర్ టీవీ ప్రసారాలకు మార్గం సుగమమైంది. అదే ఏడాది ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలు రంగుల టెలివిజన్‌కు మరింత ఆదరణ తీసుకొచ్చాయి. దీంతో నలుపు-తెలుపు టీవీల స్థానంలో రంగుల
టీవీలు క్రమంగా ఇళ్లలోకి ప్రవేశించాయి.
గ్రామీణ ప్రాంతాలకు విజ్ఞానాన్ని చేరువ చేసిన టీవీ
ఒకప్పుడు గ్రామాల్లో టెలివిజన్ ఉండటం గొప్ప విషయంగా భావించేవారు. చాలా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల వద్ద టీవీలు ఏర్పాటు చేసి ప్రజలకు కార్యక్రమాలు చూసే అవకాశం కల్పించేవారు.
వ్యవసాయ పద్ధతులు, ఆరోగ్య సూచనలు, అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ, పరిశుభ్రత, పల్స్ పోలియో వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో దూరదర్శన్ కీలక పాత్ర పోషించింది. తెలుగు వార్తల ద్వారా దేశవిదేశాల్లోని పరిణామాలు ప్రజలకు తెలిసేవి.
వరంగల్‌కు టెలివిజన్ ఎలా చేరింది?
తెలంగాణలో 1975లో ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాలకు టెలివిజన్ ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి. 1977 అక్టోబర్ 23న హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం ప్రారంభంతో తెలుగు ప్రసారాలు మరింత విస్తరించాయి. అనంతరం లో-పవర్ ట్రాన్స్‌మిటర్ కేంద్రాల ఏర్పాటుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ టీవీ ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి. తొలినాళ్లలో హనుమకొండ, నక్కలగుట్ట, బాలసముద్రం, సుబేదారి, కాజీపేట తదితర ప్రాంతాల్లో టెలివిజన్ వినియోగం పెరిగింది.
స్మార్ట్ టీవీల యుగంలో మరో ప్రపంచం
నలుపు-తెలుపు టీవీల నుంచి కలర్ టీవీలు, కేబుల్ నెట్‌వర్క్‌లు, శాటిలైట్ ప్రసారాలు, డీటీహెచ్ సేవలు, డిజిటల్ టీవీల వరకు సాంకేతికత ఎన్నో మలుపులు తిరిగింది. ప్రస్తుతం 4K టీవీలు, ఇంటర్నెట్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో వినోద ప్రపంచం మరింత విస్తరించింది. ప్రేక్షకులు తమకు నచ్చిన కార్యక్రమాలను ఎప్పుడంటే అప్పుడు వీక్షించే అవకాశం పొందుతున్నారు.
ఎందుకు జరుపుకుంటారు ప్రపంచ టెలివిజన్ దినోత్సవం?
టెలివిజన్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి 1996లో నవంబర్ 21ను ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా ప్రకటించింది. సమాచారం అందించడం, విద్యను ప్రోత్సహించడం, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజలను అనుసంధానించడం వంటి అంశాల్లో టెలివిజన్ పాత్రను గుర్తుచేసుకోవడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
ఒకప్పుడు కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చిన టెలివిజన్.. నేడు ప్రపంచ పరిణామాలను కళ్లముందుంచుతోంది. సాంకేతికత మారినా సమాచార, విజ్ఞాన, వినోద మాధ్యమంగా టీవీ ప్రాధాన్యం మాత్రం కొనసాగుతూనే ఉంది.
Tags
Be the first to react