"ENE 2 రిపీట్" మూవీ రివ్యూ: ఈసారి థాయిలాండ్ లో! మెప్పించారా లేదా?
Ee Nagaraniki Emaindi Repeat: తెలుగు యువతలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది’. ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, అందులోని పాత్రలు, సన్నివేశాలు, డైలాగ్స్‌తో ఇప్పటికీ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. వివేక్, కౌశిక్, ఉపేంద్ర, కార్తీక్ పాత్రలు యువత జీవితాల్లోని స్నేహాలను ప్రతిబింబిస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలోనూ సందడి చేస్తూనే ఉన్నాయి. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ నవంబర్ 19, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా తొలి భాగంలోని మ్యాజిక్‌ను మళ్లీ తీసుకొచ్చిందా? ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించింది?
ఈ నగరానికి ఏమైంది రిపీట్ రివ్యూ: నవ్వించిన కౌశిక్.. ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. ఫస్ట్ పార్ట్ మ్యాజిక్ రిపీట్ అయిందా?
తెలుగు యువతలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది’. ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, అందులోని పాత్రలు, సన్నివేశాలు, డైలాగ్స్‌తో ఇప్పటికీ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. వివేక్, కౌశిక్, ఉపేంద్ర, కార్తీక్ పాత్రలు యువత జీవితాల్లోని స్నేహాలను ప్రతిబింబిస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలోనూ సందడి చేస్తూనే ఉన్నాయి. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ నవంబర్ 19, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా తొలి భాగంలోని మ్యాజిక్‌ను మళ్లీ తీసుకొచ్చిందా? ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించింది?
ఈ నగరానికి ఏమైంది రిపీట్ కథేంటి?
చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న వివేక్ (విశ్వక్ సేన్), కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి), కౌశిక్ (అభినవ్ గోమటం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను) కలిసి ‘కన్యారాశి టీమ్’ పేరుతో ఒక సినిమా తెరకెక్కిస్తారు. అయితే ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అవుతుంది. దీంతో సినిమా నిర్మాత (మహేష్ భాస్కర్) తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఈ పరిణామాలతో నలుగురు స్నేహితులు ఒకరికొకరు దూరమవుతారు. ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోతారు.
ఇదిలా ఉంటే, ఉపేంద్ర కజిన్ కీర్తన (శివాత్మిక రాజశేఖర్), కార్తీక్ ప్రేమలో పడతారు. అయితే అప్పటికే కీర్తనకు పెళ్లి కుదిరిపోతుంది. ఆమెను వివాహం చేసుకోబోయే అంకిత్ (సింగర్ శ్రీరామచంద్ర) తన బ్యాచిలర్ పార్టీని ఏర్పాటు చేస్తాడు. ఈ పార్టీ కారణంగా చాలా రోజుల తర్వాత నలుగురు స్నేహితులు మళ్లీ కలుసుకుంటారు. కానీ పార్టీలో జరిగిన గొడవ కారణంగా అంకిత్‌పై దాడి చేస్తారు. దీంతో కీర్తన పెళ్లి ఆగిపోతుంది.
ఆ తర్వాత కీర్తన తండ్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అంకిత్‌తో నలుగురు స్నేహితులకు గొడవ ఎందుకు వచ్చింది? వివేక్ చేసిన ఛాలెంజ్ ఏమిటి? కీర్తన, కార్తీక్ ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? మళ్లీ నలుగురు కలిసి సినిమా తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అవకాశాలు లేక సినిమాలకు దూరమైన వివేక్ తిరిగి దర్శకుడిగా మారి విజయం సాధించాడా? అనేదే మిగతా కథ.
నవ్వించిన కౌశిక్.. ఆకట్టుకున్న వివేక్
ఈ సీక్వెల్‌కు ప్రధాన బలంగా నిలిచింది కౌశిక్ పాత్ర. తొలి భాగంలో తన కామెడీతో ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్న అభినవ్ గోమటం మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ఆయన హావభావాలు, విచిత్రమైన డైలాగ్ డెలివరీ, స్నేహితులతో చేసే సంభాషణలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా అడవి నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్, అందులో ఎలుగుబంటితో కౌశిక్ ఎదుర్కొనే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ చక్కగా ఒదిగిపోయారు. సినిమా తీయాలనే పట్టుదల, తన ఆలోచనల విషయంలో వెనక్కి తగ్గని స్వభావాన్ని తన నటనతో బాగా చూపించారు. బీచ్‌లో కౌశిక్‌ను డైరెక్ట్ చేసే సింగిల్ షాట్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే బార్ సీన్ కూడా వినోదాన్ని పంచుతుంది.
వివేక్‌కు మద్దతుగా నిలవాలా? లేక మిగతా స్నేహితుల వైపు ఉండాలా? అనే గందరగోళంలో ఉపేంద్ర పడే పరిస్థితులను వెంకటేష్ కాకుమాను సహజంగా పండించారు. శివాత్మిక రాజశేఖర్ కీర్తన పాత్రలో తన పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ప్రియదర్శిని రామ్, మహేష్ భాస్కర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీటితో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ డైరెక్టర్లు, నటులు అతిథి పాత్రల్లో కనిపించడం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌గా ఉంటుంది.
మారిన కార్తీక్ పాత్ర.. కొత్త నటుడి పెర్ఫార్మెన్స్
మొదటి భాగంలో కార్తీక్ పాత్రలో కనిపించిన సాయి సుశాంత్ రెడ్డి స్థానంలో ఈసారి శ్రీనాథ్ మాగంటి నటించారు. పాత నటుడి నటనకు అలవాటుపడిన ప్రేక్షకులకు మొదట్లో కొత్త కార్తీక్‌ను అంగీకరించడం కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. అయితే సినిమా ముందుకు సాగేకొద్దీ శ్రీనాథ్ తన నటనతో పాత్రకు న్యాయం చేశారు. చివరి వరకు వచ్చేసరికి కార్తీక్‌గా మెప్పించారు.
అయితే తొలి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో కథలోని కొత్తదనం కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. నలుగురు స్నేహితులు మళ్లీ సమస్యల్లో చిక్కుకోవడం, తమను తాము నిరూపించుకోవడానికి మరో సినిమా తీయాలని నిర్ణయించుకోవడం వంటి అంశాలు పాత ఫార్ములానే గుర్తు చేస్తాయి. కామెడీ సన్నివేశాలకు మంచి అవకాశం ఉన్నప్పటికీ, కథను ముందుకు నడిపించే బలమైన సంఘర్షణ లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది.
ముఖ్యంగా వివేక్ పాత్రలో తొలి భాగంలో కనిపించిన అల్లరి, ఊహించని ప్రవర్తన ఈసారి తగ్గినట్లు అనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, అసహనం కారణంగా అతడి పాత్రను కాస్త సీరియస్‌గా చూపించడం వల్ల స్నేహితుల మధ్య ఆశించిన స్థాయిలో వినోదం పండలేదు. అలాగే అనీషా ఆంబ్రోస్, కరుణ కుమార్ పాత్రలకు కథలో తగినంత ప్రాధాన్యత లభించలేదు.
క్లైమాక్స్‌లో తగ్గిన ఎమోషన్
సినిమాలోని ప్రధాన లోపాల్లో క్లైమాక్స్ ఒకటి. కథలో కీలకమైన సమస్యను దర్శకుడు కొంత హడావుడిగా ముగించిన భావన కలుగుతుంది. కీర్తన తండ్రి మనసు మార్చుకునే సన్నివేశం కూడా అంత సహజంగా అనిపించదు. తొలి భాగంలో నలుగురు స్నేహితుల మధ్య కనిపించిన బలమైన అనుబంధం, భావోద్వేగాలు ఈ సినిమాలో కొంత తగ్గాయి. అందుకే ప్రేక్షకులు వారి స్నేహాన్ని మరింతగా ఆస్వాదించే అవకాశం ఉన్నప్పటికీ, ఆ స్థాయి ఎమోషనల్ కనెక్ట్ పూర్తిగా కుదరలేదు.
సాంకేతిక విభాగాల పనితీరు
దర్శకుడు తరుణ్ భాస్కర్ తన సహజమైన డైలాగ్స్, విచిత్రమైన పరిస్థితుల ద్వారా నవ్వించే ప్రయత్నంలో మరోసారి తన ప్రత్యేకతను చూపించారు. పాత్రల మధ్య సంభాషణలు, ముఖ్యంగా స్నేహితుల మధ్య జరిగే సరదా సన్నివేశాలు బాగున్నాయి. అయితే కథలో భావోద్వేగాలను మరింత లోతుగా రాసుకుని ఉంటే సినిమా ఫలితం మరో స్థాయిలో ఉండేది.
వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మంచి బలంగా నిలిచింది. అయితే తొలి భాగంలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్లలో నానుతుంటే, ఈ సీక్వెల్‌లోని పాటలు అదే స్థాయిలో గుర్తుండిపోయేలా లేవు. సినిమాటోగ్రాఫర్ ఏజే ఆరోన్ థాయ్‌లాండ్ అందాలను, అక్కడి అవుట్‌డోర్ లొకేషన్లను తెరపై అందంగా చూపించారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం ఉన్నతంగా ఉన్నాయి.
ఫైనల్‌గా ఈ నగరానికి ఏమైంది రిపీట్ ఎలా ఉంది?
మొత్తంగా చెప్పాలంటే ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ అక్కడక్కడా మంచి నవ్వులు పంచే ఫ్రెండ్లీ కామెడీ డ్రామా. అభినవ్ గోమటం కామెడీ టైమింగ్, విశ్వక్ సేన్ నటన, బీచ్, బార్, ఎలుగుబంటి ఎపిసోడ్లు సినిమాకు ప్రధాన ఆకర్షణలు. మరోవైపు బలమైన కథా సంఘర్షణ లేకపోవడం, తొలి భాగంతో పోలిస్తే స్నేహితుల మధ్య భావోద్వేగాలు తగ్గడం, హడావుడిగా ముగిసిన క్లైమాక్స్ సినిమాకు మైనస్‌లుగా మారాయి.
ముఖ్యంగా మొదటి భాగాన్ని ఒక కల్ట్ మూవీగా అభిమానించే ప్రేక్షకులు అదే స్థాయి మ్యాజిక్‌ను ఆశిస్తే కొంత నిరాశ ఎదురుకావచ్చు. అయితే పాత సినిమాతో పోలికలు పక్కనపెట్టి, స్నేహితులతో కలిసి థియేటర్‌లో సరదాగా నవ్వుకోవాలనుకునే వారికి ఈ సినిమా మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.
ఈ నగరానికి ఏమైంది రిపీట్ రేటింగ్: 3/5
సినిమా వివరాలు: ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’లో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, జీవన్, కరుణ కుమార్, ప్రియదర్శిని రామ్, మహేష్ భాస్కర్ తదితరులు నటించారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాతలు
Tags
1 readers have reacted