కొన్ని రోజుల క్రితమే అరుదైన ఘనతను సాధించిన బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) తాజాగా మరో గౌరవం దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ 'ది షిఫ్ట్' ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో నిలిచారు.
క్రియాశీలత, సృజనాత్మకత, నాయకత్వం.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ లిస్ట్లో బాలీవుడ్ డైరెక్టర్ జోయా అక్తర్, హాలీవుడ్ నటీమణులు ఏంజెలినా జోలీ, సెలినా గోమెజ్ తదితరులున్నారు. 'హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026'కూ దీపిక ఎంపికైన సంగతి తెలిసిందే.
ఆ గౌరవం దక్కిన తొలి భారతీయ నటి దీపిక. 2018లో టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన '100 మోస్ట్ఇ న్ఫ్లూయెన్షియల్ పీపుల్' (ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు) లిస్ట్లోనూ ఆమె చోటు దక్కించుకున్నారు.
2022లో ఫుట్బాల్ ప్రపంచకప్ను ఆవిష్కరించి ప్రపంచాన్ని ఆకర్షించారు. నటిగా దీపికది దాదాపు 20 ఏళ్ల ప్రయాణం. ఇప్పటికీ హీరోయిన్గా రాణిస్తుండడం విశేషం. అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రంలో (AA 26) ఆమె కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే.