రోజులు మారిపోయాయి… టెక్నాలజీ చేతిలోకి వచ్చేసింది. కరెంట్ బిల్ల్లు కట్టాలన్నా, డబ్బులు జమ చేయాలన్నా—ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం సెల్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు… ప్రపంచమే ముప్పతిప్పలు లేకుండా అందుబాటులోకి వచ్చేస్తోంది.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తపాలా శాఖ ‘తపాలా 2.0’ పేరుతో కొత్త సేవలను ప్రారంభించనుంది. టెక్నాలజీని ఆధారంగా చేసుకుని తపాలా సేవలు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు.
ఇకపై స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ చేయాలంటే పోస్టాఫీస్ వెతుక్కుపోవాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. పోస్టుమెన్ సాయంతో ఇంటి వద్ద నుంచే పార్శిల్ పంపించుకునే సదుపాయం కూడా ఉంది. ఇంటిగ్రేటెడ్ మొబైల్ సేవల ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల పోస్టాఫీసుల నుంచే డిజిటల్ లావాదేవీలు జరిపే వీలుంటుంది.
ఇందుకోసం డాక్ పే యాప్ అందుబాటులో ఉంది. విశేషమేంటంటే… ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఈ యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయొచ్చు!
అంతేకాకుండా, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న సేవింగ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ వంటి వివరాలన్నీ పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలాంటి సేవా లోపాలుంటే అదే యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా సేవలు అందించాలన్న లక్ష్యంతో తపాలా శాఖ ఈ తపాలా 2.0 సేవలను ఆగస్టు నెల నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనుందని అధికారులు వెల్లడించారు. వినియోగదారులకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు.