ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం జిల్లా సరిహద్దులు దాటి వర్తింపజేసే అవకాశముందని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఆర్టీసీ ఎండీ పర్యటించారు. స్థానిక బస్టాండ్, డిపో కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందన్నారు.
ఆర్టీసీ పరంగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకు జోన్ల వారీగా సమీక్ష జరిపామని తెలిపారు. పల్లె వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు.
దీనికి సంబంధించిన అన్ని అంశాలపై ప్రతి నెలా సీఎం సమీక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని.. మరో 600 బస్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లకు కొత్తగా రంగులు వేస్తున్నామని.. ప్రయాణికులకు కుర్చీలు, ఫ్యాన్ల ఏర్పాటు సహా ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.