Jana Nayagan: దళపతి విజయ్ చివరి సినిమా ఆశించిన స్థాయిలో నిలిచిందా?

Jana Nayagan: తమిళ సినీ నటుడు, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ నటించిన 'జన నాయకన్' చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజకీయాల్లోకి పూర్తిగా అడుగుపెట్టే ముందు విజయ్ చేయనున్న చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే విడుదలకు ముందు ఎదురైన ఆలస్యం, సెన్సార్ సమస్యలు, రాజకీయ పరిణామాల తర్వాత ఈ సినిమా విడుదల కావడం ప్రత్యేకతగా మారింది.

Jana Nayagan
Jana Nayagan

ఫ్లాష్‌బ్యాక్‌లో విజయ్ మెప్పించినా.. స్క్రీన్‌ప్లే నిరాశపరిచిన 'జన నాయకన్'..

భారీ అంచనాల మధ్య వచ్చిన 'జన నాయకన్'.. ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది?..

చెన్నై: తమిళ సినీ నటుడు, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న దళపతి విజయ్ నటించిన 'జన నాయకన్' చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజకీయాల్లోకి పూర్తిగా అడుగుపెట్టే ముందు విజయ్ చేయనున్న చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే విడుదలకు ముందు ఎదురైన ఆలస్యం, సెన్సార్ సమస్యలు, రాజకీయ పరిణామాల తర్వాత ఈ సినిమా విడుదల కావడం ప్రత్యేకతగా మారింది. ఒకప్పుడు "విజయ్ చివరి సినిమా"గా ప్రచారం పొందిన ఈ చిత్రం, ఇప్పుడు "ముఖ్యమంత్రి విజయ్ తొలి విడుదలైన సినిమా"గా నిలిచింది.

ప్రారంభంలో ఈ చిత్రం తెలుగు బ్లాక్‌బస్టర్ 'భగవంత్ కేసరి'కి రీమేక్ కాదని చిత్రబృందం చెప్పినా, ట్రైలర్ విడుదలైన తర్వాత కథలోని ప్రధాన అంశాలు అదే చిత్రాన్ని ఆధారంగా తీసుకున్నట్లు స్పష్టమైంది. అయితే అసలు కథను పూర్తిగా అనుసరించకుండా, రాజకీయ నేపథ్యానికి అనుగుణంగా కొత్త కథా భాగాలను జోడించడం ఈ చిత్రంలో ప్రధాన మార్పుగా కనిపించింది.

సమాజంలో మంచి విలువలు కలిగిన వ్యక్తిగా కనిపించే విజయ్, జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న యువతి పాత్రలో నటించిన మమిత బైజూను స్వయం సమర్థురాలిగా తీర్చిదిద్దాలని, ఆమె భారత సైన్యంలో చేరాలని ప్రోత్సహిస్తాడు. అదే సమయంలో విజయ్ గత జీవితం, నిజాయితీ గల పోలీస్ అధికారి తలపతి వెట్రి కొండన్ గా ఆయన ప్రయాణం, జైలుకు ఎలా వెళ్లాడు? జాన్ హిమ్లర్ అనే విలన్‌తో ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి? దేశ భద్రతకు ముప్పుగా మారిన "ఆపరేషన్ మెలుగా"ను ఎలా అడ్డుకున్నాడు? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది.

విజయ్ తనకు అలవాటైన మాస్ స్టైల్‌ను ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బలంగా చూపించారు. పోలీస్ అధికారిగా ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అభిమానులను ఆకట్టుకుంటాయి. అయితే తొలి భాగంలో ఆయన పాత్రలో ఉత్సాహం కొంత తగ్గినట్లు అనిపిస్తుంది.

మమిత బైజు PTSD సమస్యతో బాధపడే యువతి పాత్రలో భావోద్వేగాలతో కూడిన నటనను ప్రదర్శించింది. పూజా హెగ్డే పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా, తన పరిధిలో ఆకట్టుకుంది. ప్రకాశ్ రాజ్ తన అనుభవంతో పాత్రను నడిపించినప్పటికీ కొత్తదనం కనిపించదు. బాబీ డియోల్‌కు నిడివి ఉన్న పాత్ర దక్కినా, పాత్ర రూపకల్పన బలహీనంగా ఉండటంతో ఆయన ప్రతిభ పూర్తిగా వెలుగులోకి రాలేదు.

సాధారణంగా తమిళ సినిమాల్లో సాంకేతిక నాణ్యతకు మంచి పేరు ఉంటుంది. కానీ ఈ చిత్రంలో సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ వంటి విభాగాలు ఆశించిన స్థాయిలో లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా ఈసారి తన స్థాయికి తగ్గ సంగీతాన్ని అందించలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి. కొన్ని పాటలు మాత్రమే గుర్తుండేలా ఉన్నప్పటికీ, నేపథ్య సంగీతం పెద్దగా ప్రభావం చూపలేదు.

సినిమాలో ఆకట్టుకున్న అంశాలు ఫ్లాష్‌బ్యాక్‌లో విజయ్ పోలీస్ పాత్ర, మహిళల సాధికారతకు సంబంధించిన సందేశం, "గుడ్ టచ్ – బ్యాడ్ టచ్" అంశాన్ని చూపించిన సన్నివేశం, కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, విజయ్ అభిమానులను ఆకట్టుకునే మాస్ డైలాగులు ఉన్నప్పటికి, సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి కథనం ఎక్కువసేపు సాగడం ప్రేక్షకులకు విసుగు కలిగిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు సహజత్వం కోల్పోయి, AI ఆధారిత విజువల్స్‌పై ఎక్కువగా ఆధారపడినట్లు కనిపిస్తాయి. డ్రోన్లు, రోబోలు, కృత్రిమ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు కథను బలహీనపరిచాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

అలాగే కథలో అధికంగా రాజకీయ సూచనలు చేర్చడం, భావోద్వేగాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, నెమ్మదిగా సాగే స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రతికూలంగా మారాయి.

'భగవంత్ కేసరి'లో మహిళా సాధికారత, కుటుంబ విలువలు, భావోద్వేగాలు, వినోదం సమతుల్యంగా ఉండగా, 'జన నాయకన్'లో ఆ అంశాలను పూర్తిగా కొనసాగించకుండా కొత్త రాజకీయ నేపథ్యాన్ని జోడించడం వల్ల అసలు కథ బలహీనపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయ్ రాజకీయ ప్రయాణానికి అనుగుణంగా రూపొందించిన కొత్త ట్రాక్ కథలో సహజత్వాన్ని దెబ్బతీసిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

'జన నాయకన్'పై అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలను ఈ చిత్రం పూర్తిగా అందుకోలేకపోయింది. విజయ్ నటన, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, కొన్ని సందేశాత్మక సన్నివేశాలు సినిమాకు బలం చేకూర్చినా, బలహీనమైన స్క్రీన్‌ప్లే, అసహజమైన యాక్షన్ సన్నివేశాలు, సాంకేతిక లోపాలు చిత్రాన్ని వెనక్కి లాగాయి.

రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ సినిమా వీడ్కోలు ఇవ్వలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయ్ అభిమానులకు కొన్ని క్షణాలు నచ్చినా, సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రం మిశ్రమ అనుభూతినే మిగులుస్తుంది.

Tags

Be the first to react

Latest