The Odyssey: 'ది ఒడిస్సీ'తో మళ్లీ తెరపైకి బ్లూ లోటస్ రహస్యం.. నిజం ఏమిటి? పురాణాలు, శాస్త్రం ఏం చెబుతున్నాయి?
The Odyssey: ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఒడిస్సీ' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సినిమాలో కనిపించే నీలి తామర మనిషి జ్ఞాపకశక్తిని పూర్తిగా చెరిపేస్తుందనే అంశంపై చర్చ మొదలైంది. అయితే ఇది నిజమేనా? గ్రీకు పురాణాలు చెప్పేది ఏమిటి? ఆధునిక వైద్య శాస్త్రం దీనిపై ఏం చెబుతోంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
'ది ఒడిస్సీ'లో కనిపించిన నీలి తామర నిజంగానే జ్ఞాపకశక్తిని పోగొడుతుందా?..
కమలం తింటే జ్ఞాపకశక్తి పోతుందా?.. వైద్య నిపుణులు చెప్పిన అసలు నిజం..
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఒడిస్సీ' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సినిమాలో కనిపించే నీలి తామర (Blue Lotus) మనిషి జ్ఞాపకశక్తిని పూర్తిగా చెరిపేస్తుందనే అంశంపై చర్చ మొదలైంది. అయితే ఇది నిజమేనా? గ్రీకు పురాణాలు చెప్పేది ఏమిటి? ఆధునిక వైద్య శాస్త్రం దీనిపై ఏం చెబుతోంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
'ది ఒడిస్సీ' ప్రపంచంలోని అత్యంత పురాతన గ్రీకు మహాకావ్యాల్లో ఒకటి. క్రీ.పూ. 8వ లేదా 7వ శతాబ్దంలో లిఖిత రూపం దాల్చిన ఈ కావ్యం, ట్రోజన్ యుద్ధం అనంతరం వీరుడు ఒడిస్సియస్ తన స్వస్థలమైన ఇథాకాకు చేరుకోవడానికి చేసిన పదేళ్ల సుదీర్ఘ ప్రయాణం కథను చెబుతుంది.
మార్గమధ్యంలో అతడు ఎన్నో రాక్షసులు, ఆకలి, ప్రకృతి విపత్తులు, దేవతల ఆగ్రహాన్ని ఎదుర్కొంటూ చివరకు భార్య పెనెలోపీ, కుమారుడు టెలీమాకస్ వద్దకు చేరుకుంటాడు. నోలన్ రూపొందిస్తున్న చిత్రంలో ఒడిస్సియస్ పాత్రను మ్యాట్ డేమన్ పోషిస్తుండగా, కాలిప్సో పాత్రలో చార్లీజ్ థెరాన్ నటిస్తోంది.
సినిమా కథనం ప్రకారం, ఒడిస్సియస్ ప్రయాణంలో దారి తప్పి ఒగీజియా అనే ద్వీపానికి చేరుకుంటాడు. అక్కడ కాలిప్సో అతనికి నీలి తామర పువ్వు అందిస్తుంది. దాన్ని తీసుకున్న తర్వాత అతను తన కుటుంబాన్ని, యుద్ధాన్ని, స్వస్థలానికి తిరిగి వెళ్లాలనే లక్ష్యాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఏడు సంవత్సరాల పాటు ఆ ద్వీపంలోనే గడుపుతాడు.
అయితే అసలు హోమర్ రచించిన మహాకావ్యంలో కథ కొంత భిన్నంగా ఉంటుంది. ప్రయాణం ప్రారంభ దశలో ఒడిస్సియస్, అతని సైనికులు లోటస్ ఈటర్స్ అనే ప్రజలను కలుస్తారు. వారు తామర ఫలాన్ని తిని ఆనందంలో జీవిస్తుంటారు. ఆ ఫలాన్ని తిన్న ఒడిస్సియస్ సైనికులు కూడా ఇంటికి వెళ్లాలనే కోరికను మరిచిపోతారు. దీంతో ఒడిస్సియస్ వారిని ఓడకు కట్టేసి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. కొంతకాలం తర్వాత ఆ ప్రభావం తగ్గిపోతుంది.
గ్రీకు పురాణాల్లో తామర పువ్వు మరుపు, వైరాగ్యం, ప్రపంచం నుంచి దూరంగా ఉండాలనే భావనకు ప్రతీకగా చెప్పబడింది. మద్యం, ఆధ్యాత్మిక ఉత్సాహానికి దేవుడిగా భావించే డయోనిసస్‌కు కూడా ఈ పువ్వును సమర్పించేవారని కథనాలు చెబుతున్నాయి. అలాగే దేవతల రాణి హెరాతో కూడా తామరకు సంబంధం ఉందని పురాణాల్లో ప్రస్తావన ఉంది.
భారతీయ సంప్రదాయంలో మాత్రం తామరకు అత్యంత పవిత్ర స్థానం ఉంది. రామాయణం ప్రకారం, రావణుడిపై యుద్ధానికి ముందు శ్రీరాముడు దుర్గాదేవిని 108 నీలి తామర పూలతో పూజించాలనుకున్నాడు. దేవి పరీక్షించేందుకు ఒక పువ్వును దాచిపెట్టగా, తన కంటిని తామరతో పోలుస్తారని గుర్తు చేసుకున్న శ్రీరాముడు తన కంటినే సమర్పించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన భక్తికి మెచ్చిన దుర్గాదేవి ప్రత్యక్షమై విజయాన్ని ఆశీర్వదించిందని పురాణ కథనం చెబుతోంది.
హిందూ ధర్మంలో ముఖ్యంగా గులాబీ రంగు తామర పవిత్రత, జ్ఞానం, దైవత్వానికి ప్రతీకగా భావిస్తారు. విష్ణుమూర్తి, మహాలక్ష్మీ పూజల్లో తామర పువ్వుకు విశిష్ట స్థానం ఉంది.
భారతదేశంలో తామర మొక్కలోని అనేక భాగాలను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. మఖానాగా పిలిచే తామర గింజలు ఆరోగ్యకరమైన అల్పాహారంగా విస్తృతంగా వినియోగిస్తారు. తామర కాండం కూరల్లో, వేపుళ్లలో ఉపయోగిస్తారు. పూల రేకులు, కాండాలతో సూప్‌లు కూడా తయారు చేస్తారు.
BJPsych Open జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనాల ప్రకారం, నీలి తామరపై ఇప్పటివరకు పరిమిత పరిశోధనలు మాత్రమే జరిగాయి. కొన్ని కేసుల్లో దీన్ని తీసుకున్న వ్యక్తుల్లో ఆందోళన, గందరగోళం, వాస్తవాన్ని గుర్తించలేకపోవడం, మానసిక అస్థిరత వంటి లక్షణాలు కనిపించినట్లు నమోదు అయింది. అయితే సాధారణ టాక్సికాలజీ పరీక్షల్లో ప్రత్యేకంగా హానికర పదార్థాలు గుర్తించలేదు.
ఈజిప్షియన్ బ్లూ లోటస్‌లో నూసిఫెరిన్, అపోర్ఫిన్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి మెదడులోని డోపమైన్, సెరోటోనిన్ గ్రాహకాలపై ప్రభావం చూపవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల కొందరిలో ప్రశాంతత, తాత్కాలిక ఆనందం కలగవచ్చు. మరికొందరిలో ఆందోళన, భ్రమలు, మానసిక అస్థిరత వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే దీనిపై మరింత అధ్యయనం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని మందులు, మత్తు పదార్థాలు లేదా అనస్థీషియా ప్రభావంతో ఆ సమయంలో జరిగిన సంఘటనలు తర్వాత గుర్తు లేకపోవచ్చు. అయితే అది తాత్కాలికమే. మోతాదు, ఆరోగ్య పరిస్థితి, మందు ప్రభావాన్ని బట్టి మార్పులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మత్తు స్థితిలో వ్యక్తి ప్రశాంతంగా కనిపించవచ్చు. కానీ అది శాశ్వత వ్యక్తిత్వ మార్పు కాదని, పాత జ్ఞాపకాలు పూర్తిగా చెరిపివేయవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గ్రీకు పురాణాల్లో తామర పువ్వు మరుపుకు ప్రతీకగా ఉన్నప్పటికీ, సాధారణంగా భారతదేశంలో కనిపించే తామర పువ్వు మనిషి జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయేలా చేస్తుందనే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. సినిమా, పురాణ కథనాల్లో చూపించిన అంశాలను వాస్తవ జీవితంతో పోల్చి చూడకూడదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Tags
Be the first to react