అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తరువాత జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా అపారమైన భావోద్వేగాలను రేకెత్తించింది. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ రాములోరి ధ్వజాన్ని ఆవిష్కరించగా, అది పైకి ఎగిరిన క్షణం అయోధ్య అంతటా “జై శ్రీరామ్” నినాదాలతో మార్మోగిపోయింది. ఈ చారిత్రాత్మక వేడుకకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్సెస్ సర్వసంఘచాలక్ మోహన్ భాగవత్ సహా అనేక ప్రముఖులు హాజరయ్యారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ క్షణం చిరస్థాయిగా నిలిచిపోయింది.
రాములోరి జెండాకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, పురాణ, సాంస్కృతిక విశిష్టత ఉంది. ఈ జెండాపై ఉన్న ప్రతి చిహ్నం రామాయణం, వేదాలు, ధర్మం, చరిత్రలకు ప్రతీకగా నిలుస్తుంది. జెండాలో కనిపించే సూర్యచిహ్నం, రాముడు పుట్టిన సూర్య వంశాన్ని సూచిస్తుంది. రాముడు రాజనీతిలో, ధర్మంలో, పరిపాలనలో సూర్యుడి లాంటి ప్రకాశం, న్యాయం, ఉష్ణం కలిగినవాడని భావం ఈ చిహ్నం ద్వారా తెలుస్తుంది. అలాగే జెండాలో ఉన్న పవిత్రమైన ఓం చిహ్నం విశ్వంలోని సంపూర్ణ శబ్దం, ఆదిధ్వని, సృష్టి మూలతత్వాన్ని సూచిస్తుంది.
ఇంకా ఒక ముఖ్యమైన సూచిక కోవిదారు వృక్షం (కేతకి చెట్టు). ఈ వృక్షం మందార, పారిజాత వృక్షాల స్వభావాల సమ్మేళనంగా, ఋషి కశ్యపుడు సృష్టించాడని పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఇది శక్తి, శాంతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. రామాయణంలో కూడా ఈ వృక్షం, దీని ప్రతీకాత్మకత పలుమార్లు ప్రస్తావించబడింది.
భరతుడు రాముడిని అడవిలో నుంచి తిరిగి తీసుకువచ్చేందుకు బయలుదేరినప్పుడు ఆయన రథంపై ఇదే విధమైన ధ్వజం ఉన్నట్లు కాళిదాసు రామాయణంలో పేర్కొంటారు. భరతుడు వస్తున్నాడని లక్ష్మణుడు చాలా దూరం నుంచే ఈ జెండా చూసి గుర్తించి రాముడికి సమాచారమిచ్చాడని పురాణాలు చెబుతాయి. అంటే ఈ జెండా కేవలం ఒక వస్త్రం కాదు, లక్షణం, ఆత్మ, ఆచారం, రామభక్తి సంకేతం.
అయోధ్యలో ఈ జెండా ఎగరడమే రామ జన్మభూమి తిరిగి ధర్మస్వరూపంగా నిలబడిందన్న సంకేతంగా భావిస్తున్నారు. రామనామం, భక్తి, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసే చారిత్రాత్మక క్షణంగా ఇది నిలిచిపోయింది.