రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా రుణగ్రహీతలకు శుభవార్త ఇస్తూ, వడ్డీ రేట్లు త్వరలో తగ్గే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాబోయే వారాల్లో ఆర్బీఐ రెపో రేటు తగ్గించే అవకాశం చాలా బలంగా ఉందని వెల్లడించారు. దీంతో హోమ్ లోన్, వాహన రుణాలు, ఇతర ఈఎంఐలపై భారం తగ్గవచ్చని చెప్పారు.
అక్టోబర్‌లో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలోనే రేట్ల తగ్గింపుపై మొదటి సంకేతాలు ఇచ్చినట్లు గవర్నర్ గుర్తుచేశారు. ఆ తర్వాత విడుదలైన ఆర్థిక గణాంకాలు కూడా పూర్తిగా సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా, అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 0.25% వరకు పడిపోవడం రేట్ల కోతకు కీలక కారణంగా మారింది.
ఆహార పదార్థాల ధరలు తగ్గడం, వినియోగ వస్తువులపై పన్నులు తగ్గించడం వంటి అంశాలు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడ్డాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే డిసెంబర్ ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ ప్రకటించింది.
ప్రస్తుతం రెపో రేటు 5.5% గా ఉంది. ఒకవేళ డిసెంబర్ సమావేశంలో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే అది 5.25% కు చేరుతుంది. ఇది అమలులోకి వస్తే హోమ్ లోన్, కార్ లోన్ మరియు వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలు గణనీయంగా తగ్గనున్నాయి. దీంతో రుణగ్రహీతలకు పెద్ద ఊరట లభిస్తుంది.
ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యల ప్రభావంతో మార్కెట్ కూడా స్పందించింది. ప్రభుత్వ 10-ఏళ్ల బాండ్ల రాబడులు 6.48% కు తగ్గాయి. మొత్తం మీద, వడ్డీ రేట్ల తగ్గింపు దిశగా ఆర్బీఐ వేగంగా అడుగులు వేస్తోందని, డిసెంబర్‌లో రుణగ్రహీతలకు శుభవార్త అందే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.