చెన్నై–హైదరాబాద్ మధ్య ప్రతిపాదించిన హై-స్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కీలక దశలోకి ప్రవేశించింది. ఈ రెండు మెట్రో నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని విప్లవాత్మకంగా తగ్గించగల ఈ ప్రాజెక్టుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి మీదుగా రైలు మార్గాన్ని రూపొందిస్తూ సవరించిన నివేదికను సిద్ధం చేసి తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికకు సూత్రప్రాయ ఆమోదం లభించిన వెంటనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాయి.
మొదట చెన్నై–గూడూరు–హైదరాబాద్ మార్గాన్ని ప్రతిపాదించిన అధికారులు, తమిళనాడు ప్రభుత్వ సూచనతో మార్గం మళ్లీ పునర్విమర్శించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి మీదుగా బుల్లెట్ రైలు నడిస్తే రాష్ట్రానికి, ప్రజలకు మరింత ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయంతో ప్రభుత్వం రైల్వే శాఖను కోరింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న రైల్వే అధికారులు కొత్త మార్గరేఖను సిద్ధం చేసి తుది ప్రతిపాదనను సమర్పించారు. ‘రైట్స్’ కన్సల్టెన్సీ సంస్థ చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు కోసం తమిళనాడులోనే సుమారు 223.44 హెక్టార్ల భూమి అవసరమని నివేదికలో పేర్కొన్నారు. అదనంగా చెన్నై సెంట్రల్, మీంజూరు మధ్య కొత్త బుల్లెట్ రైలు స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా సీరియస్‌గా పరిశీలిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 778 కిలోమీటర్ల దూరం ఉన్న చెన్నై–హైదరాబాద్ ప్రయాణం పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం రైలు ద్వారా 12 గంటల సమయం పడుతున్న ప్రయాణం, హై-స్పీడ్ ట్రాక్ నిర్మాణం పూర్తయిన తర్వాత కేవలం 2 గంటల 20 నిమిషాలకు పరిమితం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో ప్రస్తుత వేగం, ఆర్థిక వృద్ధి, ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని, హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్ ఏర్పాటును ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ అమలవడం వల్ల రెండు నగరాల మధ్య వ్యాపార, పర్యాటక, ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ముంబై–అహ్మదాబాద్ కారిడార్‌లో తొలి బుల్లెట్ రైలును 2027 నాటికి సూరత్ ప్రాంతంలో నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సమయంలో దక్షిణాదిలో చెన్నై–బెంగళూరు–మైసూరు మార్గానికి సంబంధించిన భూసర్వే పనులు కూడా కొనసాగుతున్నాయి. సాంకేతికత, వేగం, ప్రయాణ సౌలభ్యం పరంగా భారత రైల్వే ప్రపంచ ప్రమాణాలకు చేరేందుకు ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించనున్నాయి. తిరుపతి మీదుగా వచ్చే కొత్త మార్గం ఆమోదం పొందితే దక్షిణ భారత రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.