తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు అందిస్తున్న సేవలను మరింత నాణ్యంగా, సంతృప్తికరంగా మార్చేందుకు విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తుల అనుభవాలను విశ్లేషించి, వారి అవసరాలను అర్థం చేసుకుని సేవలను మెరుగుపరిచే దిశగా టీటీడీ బృందం ముందడుగు వేసింది. ముఖ్యంగా, ఆలయాలలో భక్తులకు అందుతున్న సదుపాయాలపై నిరంతరం ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సీఎం సూచించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం మరింత వేగవంతమైంది. ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా, అలాగే డయల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా కూడా అభిప్రాయాలు సేకరిస్తూ టీటీడీ పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేసింది.
భక్తుల అనుభవాలను ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ సర్వేలో మొత్తం 17 ప్రశ్నలను ఏర్పాటు చేశారు. ఈ ప్రశ్నలు తిరుమల యాత్ర అనుభవం, అన్నప్రసాదం నాణ్యత, కళ్యాణ కట్ట, దర్శన సౌకర్యాలు, వసతి గదుల పరిస్థితి, లగేజ్ కౌంటర్లు, ప్రైవేట్ హోటళ్ల ధరలు వంటి కీలక అంశాలను కవర్ చేస్తాయి. భక్తులు టోల్-ఫ్రీ కాల్ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి తమ అనుభవాలను తెలియజేయవచ్చు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్‌లను స్కాన్ చేయగానే అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. భక్తులు తమ పేరు, విభాగం, సేవా పరిధి వంటి వివరాలను ఎంచుకుని టెక్స్ట్ లేదా వీడియో రూపంలో అభిప్రాయాన్ని పంపించవచ్చు. 600 అక్షరాల వరకు తమ సూచనలను రాయవచ్చు లేదా వీడియోని అప్‌లోడ్ చేయవచ్చు. వాట్సాప్ నంబర్‌గా 9399399399 ను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు.
ఇక మరోవైపు, శ్రీవారి సేవకుల సహాయంతో భక్తుల అభిప్రాయాలను ఫీల్డ్ స్థాయిలో సేకరిస్తున్నారు. తిరుమల, తిరుపతిలోని దర్శన లైన్లు, వసతి ప్రాంతాలు, అన్నప్రసాదం కేంద్రాలు, సందర్శకులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సేవకులను ప్రత్యేకంగా నియమించారు. వీరు ప్రశ్నావళితో కూడిన పత్రాలను భక్తులకు అందజేసి వారి అనుభవాలు, సూచనలు, సమస్యలపై పూర్తి వివరాలు నమోదు చేస్తారు. భక్తుల అభిప్రాయాలను గౌరవిస్తూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవడమే ఈ పద్ధతి లక్ష్యం. ఈ విధంగా సేకరించిన డేటాను టీటీడీ ఉన్నతాధికారులు విశ్లేషించి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.
అంతేకాదు, ప్రతి నెలా మొదటి శుక్రవారం నిర్వహించే “డయల్ యువర్ ఈవో” కార్యక్రమం భక్తులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో భక్తులతో నేరుగా మాట్లాడి వారి సూచనలు, ప్రశ్నలు, ఫిర్యాదులను ప్రత్యక్షంగా వింటారు. అభిప్రాయాలను తెలియజేయడానికి 0877-2263261 నంబర్‌ను అందుబాటులో ఉంచారు. అలాగే ఈ-మెయిల్ ద్వారా కూడా అధికారులు ఫీడ్‌బ్యాక్ స్వీకరిస్తున్నారు. ఇలా ఐవీఆర్ఎస్, వాట్సాప్, సేవకులు, డయల్ యువర్ ఈవో, మెయిల్ వంటి అన్ని మార్గాలలో సేకరించే భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని, భక్తులకు మరింత నాణ్యమైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు టీటీడీ కృషిని మరింత బలోపేతం చేస్తోంది.