స్వామివారిపై అపారమైన భక్తిని చాటుకుంటూ హైదరాబాద్కు చెందిన ఓ దంపతులు తమ విలువైన ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) విరాళంగా ఇచ్చారు. ఇటీవల మృతిచెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి భాస్కర్రావు చేసిన మహత్తర దానానికి స్ఫూర్తిగా, మల్కాజ్గిరి వసంతపురి కాలనీకి చెందిన టి. కనకదుర్గ ప్రసాద్, సునీతా దేవి దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
వీరికీ సంతానం లేకపోవడంతో, తమ తరువాత 250 గజాల స్థలంలో నిర్మితమైన ఇంటిని స్వామివారికి చెందేలా వీలునామా రాసి తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అధికారికంగా పత్రాలను అందజేశారు.
ఇటీవల భాస్కర్రావు రూ.3 కోట్ల విలువైన ఇల్లు, రూ.66 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను వీలునామా ద్వారా శ్రీవారికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్ఫూర్తితోనే ఈ దంపతులు ముందడుగు వేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, “ఇంటి వంటి విలువైన ఆస్తిని స్వామివారికి విరాళంగా ఇవ్వడం ఇతర భక్తులకు ఆదర్శంగా నిలుస్తుంది. వీరి త్యాగభావం ప్రశంసనీయం” అన్నారు. టి. కనకదుర్గ ప్రసాద్, సునీతా దేవి దంపతులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.