రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు చెప్పగానే గుర్తొచ్చే యువ నేత రామ్మోహన్ నాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు. స్పష్టమైన వాగ్ధాటి, తడబడని ఉపన్యాసాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ఆయన ఈసారి మాత్రం తనలోని డాన్సర్‌ను బయటకు తీశారు.
2024 సాధారణ ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. రాజకీయాల మధ్య ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన ఇటీవల ఓ కుటుంబ వేడుకలో పాల్గొని స్టేజ్ మీద స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
బాబాయ్ కింజరాపు ప్రభాకరరావు కుమారుడి వివాహానికి సంబంధించి విజయనగరం జిల్లాలోని సన్ రే రిసార్ట్‌లో జరిగిన సంగీత్ ఫంక్షన్‌లో రామ్మోహన్ పాల్గొన్నారు. నాని నటించిన "గ్యాంగ్ లీడర్" సినిమాలోని పాటకు మంత్రి అచ్చెన్నాయుడు కుమారులతో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేసి అలరించారు.
కుర్తా పైజామాలో సంప్రదాయ గెటప్‌లో మెరిసిన రామ్మోహన్ డ్యాన్స్ స్టెప్పులు చూసినవారు అతనిలో ఈ టాలెంట్ ఉందా అంటూ ఫిదా అయ్యారు. బాబాయ్ అచ్చెన్నాయుడు సైతం ముచ్చటగా ఆయన స్టెప్పులను చూస్తూ ఆనందపడ్డారు.
రామ్మోహన్ డ్యాన్స్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రిగా కాదు... ఒక కుటుంబ సభ్యుడిగా, ఓ యువ రాజకీయ నాయకుడిగా తనలోని వ్యక్తిత్వాన్ని మరోసారి చాటిచెప్పారు రామ్మోహన్ నాయుడు.